calender_icon.png 26 November, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర అభివృద్ధికి నజరానా

26-11-2025 12:51:55 AM

  1. ప్రతి డివిజన్‌కు రూ.2 కోట్ల నిధులు
  2. నగరానికి మొత్తం రూ.300 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొ రేటర్లకు రాష్ర్ట ప్రభుత్వం తీపి కబురు అం దించింది. అభివృద్ధి పనుల కోసం నిధులు లేక సతమతమవుతున్న డివిజన్లకు భారీ నజరానా ప్రకటించింది. ఒక్కో డివిజన్‌కు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటిం చారు.

మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు గానూ రూ.300 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, దీనిద్వారా నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఆమె తెలిపారు. మొత్తం 150 డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం ఒక్కో వార్డుకు రూ.2 కోట్లు కేటాయిస్తూ తీర్మానం చేశారు.

రూ.కోటి కార్పొ రేటర్ ప్రత్యక్షంగా ప్రతిపాదించే పనులకు, రూ.కోటి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రితో సమన్వయం చేస్తూ కార్పొరేటర్ ప్రతిపాదించే పనులకు కేటాయించారు. ఈ నిధులను రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్ వంటి అత్యవసర మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నారు. నిధుల కేటాయింపుపై డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతోనే ఈ బడ్జెట్ సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు.