26-11-2025 12:37:02 AM
27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం
జీహెచ్‌ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ సవరణను ఆమోదించిన రాష్ట్ర క్యాబినెట్
జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
* పెద్దఅంబర్‌పేట, జల్‌పల్లి, శంషాబాద్, మణికొండ, తుర్కయాంజల్, నార్సింగి, ఆదిభట్ల, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బోడుప్పల్, నిజాంపేట్, పిర్జాదిగూడ, జవహర్‌నగర్
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) విస్తరణతో పాటు విద్యుత్, యంగ్ ఇండియా స్కూల్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (ఏటీసీ)ల ఏర్పాటు, ఔటర్ రింగ్‌రోడ్డు బయటకు కంపెనీలు తరలించి.. నగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు గాను మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదించింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం తెలంగాణ సచివాలయంలో దాదాపు 4 గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేసి.. గ్రేటర్‌ను విస్తరించాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అందుకు అవసరమైన జీహెఎంసీ యాక్ట్, రాష్ట్ర మున్సిపల్ యాక్ట్‌లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
యంగ్ ఇండియా, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడె న్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలం, ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీలతో పాటు కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
లీక్‌వీరులపై చర్యలు..
తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, క్యాబినెట్‌లో జరిగిన చర్చల సారాంశం, ఇతర అంశాలు జీవోలు రాకముందే బయటికి లీక్‌లు ఇచ్చే వారిపై కఠినచర్యలు ఉంటాయని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. ప్రభుత్వ సమాచారాన్ని బయటికి లీక్ చేసే అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. క్యాబినెట్ నిర్ణయాలు చాలా కాన్ఫిడెన్సియల్ అని, అలాంటిది జీవోలు రాకముందే వాటి సారాంశం ఇతరులకు చేరవేయడం సరికాదన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం, అభివృద్ధ్ది కార్యక్రమాలు ఒక క్రమపద్ధ్దతిలో జరగాలన్నారు. హైదరాబాద్ మహానగరం ప్రపం చంలోనే అత్యాధునిక నగరంగా ఎదగాలని ప్రభు త్వం ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.
కొత్తగా మరో డిస్కం
3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు టెండర్ల ఆహ్వానం
10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు
విద్యుత్ చార్జీలు పెంచాలనే అంశంపై చర్చ జరగలేదు: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ర్ట క్యాబినెట్ నిర్ణ యం తీసుకుంది. ఇప్పటికే బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్ సిస్టమ్ ఉంది. ఇటీవల అక్కడ అమలుచేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు రూ. 14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని.. ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్‌వర్క్ వైర్లన్నీ అండర్‌గ్రౌండ్‌లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది.
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి) : ప్రస్తుతం తెలంగాణలో జెన్‌కో, ట్రాన్స్‌కోతో పాటు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డిస్కమ్‌లు ఉన్నాయి. అదనంగా మరో డిస్కమ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పా రు. కొత్తగా ఏర్పాటుచేసే డిస్కమ్ పరిధిలో లిప్ట్ ఇరిగేషన్ విద్యుత్ కనెక్షన్లు, హైదరాబాద్‌లో మెట్రో వాటర్ సరఫరా సివరేజ్ బోర్డు పవన్ కనెక్షన్లు, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు, సురక్షిత మంచినీటి పథకాలు వస్తాయని మంత్రి తెలి పారు.
‘రాష్ర్టంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాం డ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలను క్యాబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్తు విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించింది. పునరుత్పాదక విద్యుత్తు వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభు త్వం తెచ్చిన నిబంధనల ప్రకారం..
రాష్ర్టంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. వి ద్యుత్ చార్జీల పెంపు అనే అంశంపై చర్చ జరగలేదని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమా ధానమిచ్చారు. రెప్పపాటు సమయంలోనూ వి ద్యుత్ పోకుండా ఉండాలనే నిర్ణయంతో ప్రభు త్వం ముందుకు పోతుందన్నారు.
విద్యుత్‌పై క్యాబినెట్ నిర్ణయాలు..
* రాష్ర్టంలో ఇప్పుడున్న ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ రెండు డిస్కమ్లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ర్టంలో ఉన్న వ్యవ సాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తాయి.
* విద్యుత్తు డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలను కేబినేట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్తు విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను పరిశీలించింది. పునరుత్పాదక విద్యుత్తు వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం.. రాష్ర్టంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3 వేల మెగా వాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెం డర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
* సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల కాల పరిమితితోనే ఈ టెండర్లు కూడా పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ర్టంలో పలు చోట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలున్నాయి. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇప్పటికే డిస్కమ్‌ల వద్ద ఉన్న ఎంవోయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో 10 వేల మెగా వాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వమే అవసరమైన భూమిని కేటాయించి, నీళ్లను అందిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ముందుగా మన డిస్కమ్ లకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.
* రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లో భాగంగా రాష్ర్ట మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్తును తమతంట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్‌కు అప్లు చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఇప్పటికే రాష్ర్టంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది.
* రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాల్వంచ, మక్తల్‌లోనూ ఎన్టీపీసీ అధ్వ ర్యంలో విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచిం చింది. ఎన్టీపీసీకి ఈ యూనిట్ నిర్మాణం అప్పగిస్తే ఎంత విద్యుత్ యూనిట్ రేట్ పడుతుంది.. జెన్ కో ద్వారా చేపడితే ఎంత రేట్ పడుతుందో.. ముందుగా అంచనాలు వేసుకొని తుది పరిశీలన చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.