26-11-2025 12:51:14 AM
-బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఎన్నుకుంటే ప్రోత్సాహక నిధులు
- పంచాయతీలకు కేంద్ర మంత్రి నజరానా
- కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరిన కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే... ఆ గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులను అందజేస్తానని బండి సంజయ్ ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివృద్ధి వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ మేరకు మంగళవారం మీడియాకు ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు. ‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రోత్సాహక నిధులిస్తామని హామీ ఇవ్వడంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 70 గ్రామ పంచాయతీల్లో బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేశారు. కానీ, ఐదేళ్లయినా ఆయా గ్రామాలకు కేసీఆర్ ప్రభుత్వం నయాపైసా ఇవ్వకుండా మొండి చేయి చూపింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఏకగ్రీవం పేరుతో నజరానా ప్రకటించి మోసం చేసింది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలకుల మాటలు నమ్మి ఏకగ్రీవం చేసిన పంచాయతీల ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ఆ రెండు పార్టీలు మళ్లీ ప్రలోభ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నా. గత బీఆర్‌ఎస్ పాలనలో అప్పులు తెచ్చి అభివృద్ధి చేసిన సర్పంచులకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడటమే నిదర్శనం.
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో కొనసాగుతున్నవే. అసలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేది కూడా కేంద్ర నిధుల కోసమేననే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతున్నా. ఎమ్మెల్యేలకు గతంలో ఇచ్చిన సీడీఎఫ్(కాన్ స్టిట్యూ యన్సీ డెవలెప్ మెంట్ ఫండ్)ను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ఫలితంగా ఎమ్మెల్యేగా గెలిచినా పంచాయతీలకు నయా పైసా కూడా ఇయ్యలేని పరిస్థితి. కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నాకు ఎంపీ లాడ్స్ నిధులు ఉన్నాయి.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బుల్ (సీఎస్సార్) ఫండ్ రూపం లో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఇప్పటికే విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేస్తున్న. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే... ఆయా గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తా. పూర్తిస్థాయిలో ఆ గ్రామాన్ని అభి వృద్ధి చేసేందుకు కృషి చేస్తా.’ అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.