26-11-2025 12:46:58 AM
జాతీయ గేయాన్ని మతంతో ముడిపెడతారా?
ఎంఐఎం తీరుపై ఎంపీ రఘునందన్ ఫైర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వందేమాతరం గీతాలాపన సమయంలో ఎంఐఎం సభ్యులు వ్యవహరించిన తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తిని చాటే గేయాన్ని మతంతో ముడిపెట్టి చూడటం దౌర్భాగ్యమని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘వందేమాతరం గీతం రాసి 150 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా, భావి భారత పౌరుల్లో దేశభక్తిని నింపాలనే ఉద్దేశంతో కౌన్సిల్ సమావే శంలో ఈ గీతాన్ని ఆలపించాలని నిర్ణయించాం. స్వాతంత్య్ర పోరాట సమరంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ముస్లిం, క్రైస్తవ పెద్దలు సైతం వందేమాతరం అని నినదించారు. నాడు లేని అభ్యంతరం.. నేడు ఎంఐఎం పార్టీకి ఎందుకు వస్తోంది’ అని ప్రశ్నించారు. ‘బీజేపీ కార్పొరేటర్లు గెలిచి నాలుగన్నరేళ్లు అవుతోంది. రోడ్లు, డ్రైనేజీలు బాగులేక ప్రజలు నిలదీస్తున్నారు. అభివృద్ధి నిధులు అడగడం ప్రజాస్వామ్య హక్కు.
కానీ జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తించడం మాత్రం కచ్చితంగా దేశద్రోహమే అవుతుంది’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మాబొరుసు లాంటివని ఎద్దేవా చేశారు. పదేళ్లు బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్కులు, ఖాళీ స్థలాలు, పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేలా ఉన్న జీవో నంబర్ 27పై తక్షణం చర్చ జరగాలని ఎంపీ డిమాండ్ చేశారు.
వారం రోజుల్లో దీనిపై చర్చ జరుపుతామని మేయర్ హామీ ఇచ్చారు. ఈలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, భూములు అప్పగించాక చర్చ జరిపి ప్రయోజనం లేదన్నారు. వారం రోజుల్లోగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దీనిపై స్పష్టత ఇవ్వాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అని ఆయన హెచ్చరించారు.