26-11-2025 12:39:50 AM
కౌన్సిల్ సభ నిరవధిక వాయిదా
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కౌన్సి ల్ సమావేశం మంగళవారం ఆద్యంతం గందరగోళం, ఉద్రిక్తతల నడుమ సాగిం ది. ప్రజా సమస్యలపై జరగాల్సిన చర్చ పక్కదారి పట్టి.. పంతాలు, పట్టింపులు, రాజకీయ నినాదాలతో కౌన్సిల్ హాల్ దద్దరిల్లింది. ఉదయం దున్నపోతుల నిరసనతో మొదలైన హైడ్రామా, సభలో వందేమాతరం గీతాలాపన వివాదంతో తారస్థాయికి చేరింది.
సభ్యుల తీరు, సభా మర్యాదలు పాటించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. చివరకు సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం సభ్యుల నిరసనల కారణంగా అరగంట ఆలస్యంగా మొదలైంది. కౌన్సిల్ హాల్ బయట ఉన్న ఫౌంటెయిన్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో దున్నపోతులకు వినతి పత్రాలు సమర్పించి నిరసన తెలిపారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్లకార్డులతో ర్యాలీగా లోపలికి వచ్చారు. సభ్యులు ప్లకార్డులతో లోపలికి రావడాన్ని మార్షల్స్ అడ్డుకున్నారు. సీట్ల వద్దకు వచ్చి ప్లకార్డులను లాక్కునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, మార్షల్స్‌కు మధ్య వాగ్వాదం జరిగిం ది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంలో రెండు కొత్త సంప్రదాయాలకు శ్రీకారం చుట్టారు.
జీహెచ్‌ఎంసీ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలను ఆలపించాలని నిర్ణయించారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభంలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. జాతీయ గేయం వస్తున్న సమయంలో సభ్యులందరూ గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. ఎంఐఎం పార్టీకి చెందిన కొందరు సభ్యులు మాత్రం తమ కుర్చీల్లో కూర్చుండిపోయారు. ఎంఐ ఎం సభ్యుల తీరుపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేశంలో ఉండాలంటే జాతీయ గేయాన్ని గౌరవించాల్సిందే అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బీజేపీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కొంతమంది సభ్యులు ఏకంగా టేబుళ్లపైకి ఎక్కి నిరసన తెలపడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య తోపు లాట జరిగే పరిస్థితి నెలకొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వెంటనే మార్ష ల్స్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు సమావేశంలో ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేల తీరుపై కూడా కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశం అంటే కార్పొరేటర్లు తమ డివిజన్ల సమస్యలు చెప్పుకునే వేదికని, ఇక్కడ ఎమ్మెల్యేలు మాట్లా డటం ఏమిటని పలువురు ప్రశ్నించారు. కార్పొరేటర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గందరగోళం నడుమనే సంతాపం..
గందరగోళం నడుమనే మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఇటీవలే మృతి చెందిన ఎంఐఎం కార్పొరేటర్ ముజాఫర్ హుస్సేన్‌లకు సభ సంతాపం తెలిపింది. అలాగే జయ జయహే తెలంగాణ రచయిత అందెశ్రీని స్మరించుకున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే వివేకానంద, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే లు సుధీర్‌రెడ్డి, నవీన్ యాదవ్, కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్, బొంతు శ్రీదేవి తదితరులు వీరితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
కార్పొరేటర్ల డిమాండ్లు.. సమస్యలు
భోజన విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితి చక్కబడలేదు. సభ సజావుగా సాగేలా సహకరిస్తే కార్పొరేటర్లకు తాను ఓ బహుమతిగా నిధుల కేటాయింపు విషయాన్ని ప్రకటించనున్నట్లు మేయర్ ఆశ చూపారు. కానీ ఆ సహకారం కొద్దిసేపటికే పరిమితమైంది. రోడ్లు, శానిటేషన్‌పై ఎంఐ ఎం సభ్యుడు సోహెల్ ఖాద్రి మాట్లాడుతూ చార్మినార్ జోన్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టినా కోచ్‌లను నియమించకపోవడంపై మండిపడ్డారు.
కార్పొరేటర్లు ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి, భాగ్యలక్ష్మి, బొంతు శ్రీదేవి, వంగ మధుసూదన్‌రెడ్డి శానిటేషన్‌పై ప్రశ్నలు సంధించారు. అదనపు కమిషనర్ రఘుప్రసాద్ ఇచ్చిన సమాధానంపై బీజేపీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. స్వీపర్లకు మెయిన్ రోడ్ల స్వీపింగ్ బాధ్యతలను మినహాయించాలని డిమాండ్ చేశారు. చర్చ జరుగుతున్న సమయంలో సభ్యులు ఒకరినొకరు ‘ఆమె, ఈమె, నీవు’ అంటూ ఏకవచనంతో సంభోదించుకోవడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభను గౌరవించాలని మేయర్ కోరుతుండగానే.. ఎంఐఎం ఎమ్మెల్యే జుల్ఫికర్ తన సీటుపై గట్టిగా కొట్టి నిరసన తెలిపారు. మేయర్ సీటును, సభను గౌరవించడం లేదని, ఇలాగైతే సభను నడపలేమని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. సాయంత్రం 5 గంటలకు కౌన్సిల్ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.
గ్రేటర్ గొడుగు కిందకు 27 మున్సిపాలిటీలు..
నగర భౌగోళిక స్వరూపాన్ని మార్చేసేలా.. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 46 అజెండా అంశాలతో పాటు రెండు టేబుల్ ఐటమ్‌లకు సభ్యులు ఆమోదం తెలిపారు.
వేగంగా విస్తరిస్తున్న నగరాభివృద్ధిని దృష్టి లో ఉంచుకుని, ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న లేదా ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించింది. శివారు మున్సిపాలిటీల్లో అభివృద్ధిలో ఉన్న వ్యత్యాసాలను సరిచేయడం, ఏకరీతి ప్రణాళిక మెరుగైన పౌరసేవలు అందించడమే లక్ష్యంగా ఈ విలీ నం జరగనుంది. జీహెచ్‌ఎంసీ చట్టం-1955 ప్రకారం ప్రభుత్వం పంపిన ప్రీయాంబుల్‌ను కౌన్సిల్ ఆమోదించింది.
విలీనమయ్యే మున్సిపాలిటీలు ఇవే..
పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబాట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్ కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లా రం, తెల్లాపూర్, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.