calender_icon.png 26 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల నగారా

26-11-2025 12:32:16 AM

మొత్తం మూడు విడతల్లో నిర్వహణ

డిసెంబర్ 11, 14, 17న పోలింగ్

  1. నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
  2. రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్, 1,12,242 వార్డు స్థానాలు
  3. అమల్లోకి ఎన్నికల కోడ్ 

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి) : రాష్ట్రమంతా ఎప్పుడె ప్పుడా ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు రానేవచ్చాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నగారా మోగిం ది. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ర్ట ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ర్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు వివ రాలు వెల్లడించారు.

రాష్ర్టవ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. మొదటి విడత డిసెంబర్ 11న, రెండో విడత డిసెంబర్ 14న, మూడో విడత డిసెంబర్ 17న పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ.. రాష్ర్టవ్యాప్తంగా ఎన్నికల కోడ్ మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ‘సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించామని, కానీ కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్‌పై న్యాయస్థానం స్టే విధించిందని తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా గ్రామీణ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.

గురువారం (నవంబర్ 27) నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నామని స్పష్టం చేశారు.

రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు అయిన నేపథ్యంలో రాష్ర్టంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. 

హైకోర్డు విచారణ మరోసారి వాయిదా..

స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టులో చేపట్టాల్సిన విచారణ మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు సీజే ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉండగా చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడినట్టు తెలుస్తోంది. అయితే సోమవారం జరగాల్సిన విచారణను మంగళవారానికి వాయిదా వేయగా విచారణ మరోసారి వాయిదా పడింది.

ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం, మరోవైపు హైకోర్టు విచారణ వాయిదా పడటంతో ఎన్నికల నిర్వహణ ఆసక్తికరంగా మారింది. అయితే 50 శాతం రిజర్వేషన్ నిబంధనను మించకుండా, పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు వెలువరించే తీర్పు ద్వారా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులేమీ ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.