calender_icon.png 22 January, 2026 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరవేగంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలి

22-01-2026 02:42:13 AM

  1. పాలమూరు--రంగారెడ్డి’ పురోగతిపై సమీక్షించాలి
  2. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి కోసం ప్రత్యేక విభాగం
  3. తుమ్మిడిహట్టి బ్యారేజ్ డీపీఆర్‌కు వేగవంతంగా సర్వేలు, అధ్యయనం
  4. కాళేశ్వరం పునరుద్ధరణ డిజైన్లు నెలలోపు పూర్తి
  5. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : రాష్ర్టంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మా ణంతోపాటు పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై తరచుగా సమీక్షించుకుని పనుల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని  అధికారులకు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను కొనసాగించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటిం చారు.

ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో టన్నెల్‌లో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మెషీన్ శకలాలను పూర్తిగా తొలగించామని, ప్రస్తుతం టన్నెల్‌లో రైలు ట్రాక్ సహాయం తో మరమ్మతులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టుల పనుల్లో నిబంధనలు పాటిస్తూనే నాణ్యతాప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులకు ఉపదేశించారు. రాష్ర్టంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం సచివాలయంలో నీటిపారుదల అధికారులతో ఆయ న సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్‌లతో పాటు ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి సరిపడా నిధుల కేటాయింపునకు సీఎం అంగీకరించారని, యుద్దప్రాతి పదికన పూర్తికి అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. నిర్మాణాల విష యంలో అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ఎక్కడైనా అలసత్వం ప్రదర్శిస్తే ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించబోదని హెచ్చరించారు. తుమ్మిడిహట్టి వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు నిర్మిం చ తలపెట్టిన బ్యారేజ్‌కు సంబంధించిన డీపీఆర్ తయారీకి పూర్తి స్థాయిలో సర్వేలు, పరిశోధనలు వేగవంతంగా కొనసాగుతున్నా యన్నారు.

బ్యారేజ్ ప్రాంతంలో అవసరమై న 73 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టోపోగ్రాఫికల్ సర్వే పూర్తయిందని, దానితో పాటు 85 కిలోమీటర్ల కాల్వ సర్వేను కుడా పూర్తి చేశామన్నారు. అదనంగా వార్ద, వైన్ గంగా నదులకు ఇరువైపులా క్రాస్-సెక్షన్ లెవల్స్ సర్వే పూర్తి అయినందున డీపీఆర్‌లకు తుదిరూపం ఇచ్చేందుకు కసరత్తు  పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 

పునరుద్ధరణ డిజైన్లు నెలలో పూర్తి చేయాలి

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజ్‌లకు సంబంధించిన పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై సైట్ తనిఖీ నివేదికతో పాటు పనులకు సంబంధించిన ప్రణాళికాలు సమర్పించిందని వివరించారు. బుధవారం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ముగ్గురు సభ్యులతో కూడిన బృందం అధ్యయనం ప్రారంభించగా మరో ఇద్దరు సభ్యులు బోర్ హోల్ ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల వద్ద పరిశీలన పనులు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ మూడు బ్యారేజ్‌ల పునరుద్ధరణ డిజైన్లు నెల వ్యవధిలో రూపొందించాలని  అధికారులకు చెప్పారు. అదేవిధంగా నీటిపా రుదల ప్రాజెక్టుల నిర్మాణానికి  పర్యావరణ అనుమతులు పొందేందుకు ఒత్తిడిని పెంచాలన్నారు. పర్యావరణ అనుమతులకు అను మతిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను ఆయన  ఉటంకించారు.