22-01-2026 02:39:19 AM
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : గాంధీభవన్‌లో జరుగుతున్న నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాక సమావేశం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్‌రెడ్డి బయటకు వెళ్ళిపోయారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ సమావేశానికి హాజరుకావడంతో జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి బయటికి వచ్చిన జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తో కొట్లాడిన తమ లాంటివాళ్లకి అవమానం జరుగుతోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెడుతున్నారని, అలా కూర్చోబెడితే ఏం గౌరవం ఉంటుందని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నా రు.
అభివృద్ధి కోసం వచ్చానని చెబుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ అంతర్గత సమావేశానికి ఎలా పిలిచారని పార్టీ నేతలను ప్రశ్నించారు. ఆయన ఎందుకు వస్తారు..? బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకుని మున్సిపల్ ఎన్నికల పై ఎలా చర్చిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందని ఊహించలేదని, గతంలోనూ ఇలాంటి పరిస్థితి వస్తే భరించానని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాను వెళ్లిపోయే ప్రసక్తే లేదన్నారు. ఈరోజు సమావేశం భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలా చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు.
నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ తనకు గౌరవం ఇచ్చిందని, కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తన గౌరవాన్ని తగ్గించే విధంగా చేపట్టిన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. సంజయ్ ఏ పార్టీ అనే అంశం స్పీకర్ ముందు ఉందని, అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి నా పక్కన కూర్చోబెట్టారన్నారు. ఇది కేవలం తన ఒక్కడి ఆవేదన కాదని, లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన అని చెప్పారు. బీఆర్‌ఎస్ ఆకృత్యాలకు పదేళ్లపాటు కార్యకర్తలు గురయ్యారని, ఇప్పుడు అదే బీఆర్‌ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేను తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టారన్నారని విమర్శించారు. అధికారం ముఖ్యం కాదని, రాజ్యాంగం విలువలు కాపాడటం కూడా ముఖ్యమన్నారు.