21-09-2025 12:00:00 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మహిళా ఆర్థిక స్వావలంబనకు తమ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాబోయే ఐదేళ్లలో రాష్ర్టంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం, యూసుఫ్‌గూడలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, దనసరి సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో కలిసి ఆయన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
వడ్డీ వ్యాపారుల బారి నుంచి విముక్తి
మహిళా శక్తి కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పదేళ్లుగా మహిళా సంఘాలను పట్టించుకున్న నాథుడే లేడన్నారు. చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోయారని ఆవేదనవ్యక్తం చేశారు. ఇకపై ఆ అవస రం లేదని.. మీ శ్రమ వృథా కాదని, మీ వెనుక మేమున్నాం, అని భట్టి భరోసా ఇచ్చారు.
ప్రతిపక్షాల అవహేళనలను పట్టించుకోకుండా, మొదటి సంవత్సరంలోనే రికా ర్డు స్థాయిలో రూ. 21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, ఇది తమ సంకల్ప బలమని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిల్పారామంలో వంద దుకాణాలు కేటాయించామని, ఆర్టీసీకి బస్సులు లీజుకు ఇప్పించే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
మహారాణులుగా ఎదగాలి: మంత్రి సీతక్క
మహిళలు వడ్డీ లేని రుణాలు ఉపయోగించుకుని మహారాణులుగా నిలబడాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. మహిళల రుణ చెల్లింపుల రేటు 98% ఉండటం గర్వకారణమన్నారు. నారాయణపేటలో మహిళలు నడిపిన పెట్రోల్ బంక్ ఆరు నెలల్లోనే రూ.13.80 లక్షల లాభం తెచ్చిపెట్టిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి, అని ఆమె అన్నారు. మహిళా సంఘ సభ్యురాలికి రూ. 10 లక్షల బీమా, రూ.2 లక్షల వరకు రుణమాఫీ వంటి పథకాలతో భద్రత కల్పిస్తున్నా మన్నారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం : మంత్రి పొన్నం ప్రభాకర్
తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా 32,813 సంఘాలకు రూ.41.51 కోట్లు వడ్డీ లేని రుణాలు అందిస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇందిరా మహిళా శక్తి ద్వారా 35 క్యాంటిన్లు, 80 కుట్టు మిషన్ల యూనిట్లు, 63 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందించాం, అని ఆయన తెలిపారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి గడ్డం వివేక్
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉం దని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. మహిళలు ప్రభు త్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాల న్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ జీహెఎంసీ పరిధిలో ఈ ఏడాది ఇప్పటికే 3,609 సంఘాలకు రూ.413.77 కోట్లు రుణాలు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మె ల్యే ఆదినారాయణ, టీఎస్‌ఎస్ చైర్‌పర్సన్ డాక్టర్ వెన్నెల, సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ హరిచందన, అడిషనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, పంకజ తదితరులు పాల్గొన్నారు.