21-09-2025 12:00:00 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, పూల పండుగ బతుకమ్మను ఈసారి విశ్వవేదికపై నిలపాలని రాష్ర్ట ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఈ నెల 28న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ బుక్ రికార్డులే లక్ష్యంగా, అపూర్వ రీతిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది.
పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహా వేడుకలో 50 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమం కోసం జీహెఎంసీ పరిధిలోని స్వయం సహాయక బృందాల నుంచి సుమారు 10 వేల మంది మహిళలను ఒకేచోట చేర్చి, బతుకమ్మ ఆడి రికార్డు సృష్టించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
గతంలో 2016లోనూ గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించగా, ఆఖరి నిమిషంలో వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. ఈసారి అలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మహిళలను స్టేడియానికి తరలించడానికి జీహెఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ యూసీడీ అధికారులు సర్కిళ్ల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. వేడుకలకు ముందే మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. వేడుకలను విజయవంతం చేసేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు జీహెఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
ట్యాంక్‌బండ్‌పై హెలికాప్టర్‌తో పూల వర్షం
బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 30న ట్యాంక్ బండ్‌పై మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమరజ్యోతి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2,500 మంది మహిళలతో కనుల పండువగా భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ పరేడ్ సమయంలో ఆకాశం నుంచి హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించి, వేడుకలకు సరికొత్త శోభను తీసుకురానున్నారు.
ఉత్సవాల షెడ్యూల్ ఇలా..
21వ తేదీ : వేయి స్తంభాల గుడి, వరంగల్ ప్రారంభోత్సవం (సాయంత్రం)
హైదరాబాద్ శివారులో మొక్కలు నాటడం (ఉదయం)
22వ తేదీ: శిల్పరామం, హైదరాబాద్
పిల్లలమర్రి, మహబూబ్‌నగర్
23వ తేదీ: బుద్ధవనం, నాగార్జునసాగర్, నల్లగొండ
24వ తేదీ : కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భూపాలపల్లి
సిటీ సెంటర్, కరీంనగర్
25వ తేదీ: భద్రాచలం ఆలయం- కొత్తగూడెం, ఖమ్మం
జోగులాంబ అలంపూర్, గద్వాల
స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ ఆర్ట్ క్యాంప్ (25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు)
26వ తేదీ: అలీ సాగర్ రిజర్వాయర్, నిజామాబాద్
ఆదిలాబాద్, మెదక్
నెక్లెస్ రోడ్, హైదరాబాద్ సైకిల్ ర్యాలీ (ఉదయం)
27వ తేదీ : మహిళల బైక్ ర్యాలీ -నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, హైదరాబాద్ (ఉదయం)
ఐటీ కారిడార్, హైదరాబాద్ బతుకమ్మ కార్నివల్ (సాయంత్రం)
28వ తేదీ: ఎల్‌బీ స్టేడియం, హైదరాబాద్
గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (10,000 కుపైగా మహిళలతో 50 అడుగుల బతుకమ్మ)
29వ తేదీ : పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్ ఉత్తమ బతుకమ్మ పోటీలు, సరస్ ఫెయిర్ (ఎస్‌హెచ్‌జీలతో)
రెసిడెంట్ వెల్ఫేర్ అసోసిమేషన్స్(ఆర్‌డబ్ల్యూఎస్), హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్(హైసియా), హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతం బతుకమ్మ కార్యక్రమం, పోటీలు
30వ తేదీ: ట్యాంక్‌బండ్ గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, ఇకెబానా - జపనీయుల ప్రదర్శన, సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్ షో