calender_icon.png 4 May, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుత్తికొండ వినోద్ కు మార్పు స్వచ్ఛంద సంస్థ చేయూత

03-05-2025 05:49:43 PM

10 వేలు ఆర్థిక సహాయం అందజేసిన "మార్పు"

గుత్తికొండ వినోద్ కుటుంబానికి న్యాయం చేయాలి..

సిపిఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి...

వైరా (విజయక్రాంతి): ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్న గ్యాస్ సిలిండర్ లీకేజీ దుర్ఘటన బాధితుడు గుత్తికొండ వినోద్ కుమార్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని సిపిఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల తల్లడ మండలం పాత మిట్టపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించడంతో గుత్తికొండ వినోద్, నాయనమ్మ సుశీల, ఇద్దరు కుమారులు వరుణ్, తరుణ్, ఇద్దరు మేనకోడళ్ళు లింసి, ప్రిన్సి మొత్తం ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నాయనమ్మ సుశీల, ఇద్దరు కుమారులు వరుణ్, తరుణ్ ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. ఇద్దరు మేనకోడళ్ళు లింసి, ప్రిన్సి హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

వారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది. హాస్పిటల్ ఖర్చులు భరించలేక గుత్తికొండ వినోద్ ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు. సిపిఐ(ఎం) బృందం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, తల్లడ మండలం కార్యదర్శి ఐనాల రామలింగేశ్వరరావు,  సీనియర్ నాయకులు ఇందొజు సత్యమూర్తి, షేక్ అక్బర్, కళ్యణపు కృష్ణయ్య శనివారం పాత మిట్టపల్లి గ్రామం వెళ్ళి తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్న గుత్తికొండ వినోద్ ను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

మార్పు స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల మోహన్ రావు, రజిత 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ... గ్యాస్ కంపెనీ నిర్లక్ష్యం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుందని, ఇంకా ఇద్దరు పిల్లలు పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన దుర్ఘటనకు గ్యాస్ కంపెనీ పూర్తి బాధ్యత వహించాలని, బాధితులకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వినోద్ భార్య రేవతి, అమ్మ నిర్మల, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.