calender_icon.png 6 October, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ స్థానిక రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్, బీజేపీ అడ్డంకులు

06-10-2025 01:34:29 AM

  1. ఎంపీ ఈటెలకు నైరాశ్యమెందుకు?
  2. బీసీల గురించి మాట్లాడే హక్కు వారికి లేదు
  3. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

మహబూబాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అడ్డంకులు సృష్టిస్తున్నాయని, ఇటీవలే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్థానిక ఎన్నికలు జరగవని చేసిన వ్యాఖ్యలు ఎందుకు తార్కానంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి   సీతక్క అన్నారు.

త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కామారెడ్డి వేదికగా ఇచ్చిన కుల గణన హామీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పనలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. అయితే బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎంపీ ఈటెల రాజేందర్ బీసీలకు అమలు చేస్తున్న 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వానికి అండగా నిలిచి కేంద్రంపై వత్తిడి తెచ్చి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా సహకరిం చాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా మాట్లాడడం బీసీ బిడ్డగా ఆయనకు సరైంది కాదని,ఈటెల రాజేందర్ కు బీసీ రిజర్వేషన్ల అమలుపై నైరాశ్యం ఎందుకన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం సర్వే చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు  రాజ్యాధికారం దక్కేందుకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నదనీ, ఇందుకోసం ప్రత్యేకంగా జీవో జారీ చేసిందని సీతక్క తెలిపారు.

ప్రతి బీసీ బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, మండల అధ్యక్షులు వజ్జా సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, బిట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.