calender_icon.png 6 October, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాదేశికపోరుకు.. దరఖాస్తుల స్వీకరణ

06-10-2025 01:38:02 AM

కీలకంగా ‘గంగారం’ జడ్పీటీసీ

మహబూబాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడత నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక సభ్యుల ఎన్నిక జరగనుండడంతో రాజకీయ పార్టీల నుండి పోటీ పడేందుకు ఔత్సాహిక అభ్యర్థులు టికెట్ల కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తో పాటు భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టాయి.

అధికార కాంగ్రెస్ రెండు రోజుల నుండి ఎంపీటీసీ, జెడ్ పి టి సి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి ప్రత్యేక ఫార్మేట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఒక్కో స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ప్రాథమిక పరిశీలన తర్వాత ఒక్కో స్థానం నుండి మూడు నుండి ఐదు దరఖాస్తులను జిల్లా పార్టీకి పంపించే విధంగా మార్గదర్శకాలు సూచించారని ప్రచారం సాగుతోంది.

దీనితో ప్రస్తుతం గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు స్థానిక నాయకులు దరఖాస్తులను సమర్పిస్తున్నారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి కనీసం ముగ్గురికి తగ్గకుండా దరఖాస్తులను సమర్పిస్తుండడం విశేషం. ఇక  బీ ఆర్ ఎస్, బీజేపీ పార్టీలు అన్ని జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి. అలాగే వామ పక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు కూడా తమకు బలం ఉన్నచోట పట్టు నిలుపుకోవడానికి అభ్యర్థులను పోటీ పెట్టేందుకు కార్యచరణ చేస్తున్నాయి.

మహబూబాబాద్ జిల్లాలో 18 జడ్పీటీసీ, 193 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, మొదటి దశ లో 9 జడ్పిటిసి స్థానాలకు, 104 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయిం చారు. అలాగే రెండో దశలో 9 జెడ్పిటిసి స్థానాలకు, 89 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించారు. మొత్తంగా ఒక్కో జెడ్పిటిసి స్థానానికి కనీసం నలుగురు అభ్యర్థులకు తక్కువ కాకుండా బహుముఖ పోరు ఉంటుందని రాజకీయంగా విశ్లేషిస్తున్నారు.

ఇక ఎంపీటీసీ స్థానాల్లో కూడా నలుగురికి మించి పోటీపడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో జిల్లా పరిషత్ స్థానంతో పాటు వివిధ మండలాల్లో అధ్యక్ష పీఠాలను అప్పటి అధికార పార్టీ టిఆర్‌ఎస్ దక్కించుకోగా, ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని మొదలుకొని మండలాల్లోని ఎంపీపీ స్థానాలను ‘హస్త’గతం చేసుకోవాలని ఉవ్విల్లురూతోంది.

జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంటు స్థానం కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు పార్లమెంటు సెగ్మెంట్ గా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో ప్రాదేశిక పోరులో కాంగ్రెస్ పట్టు సడలకుండా చూసుకునే విధంగా వ్యూహరచన చేస్తోంది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలబడ్డ బిఆర్‌ఎస్ ప్రాదేశిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తోంది.

ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించు కోవాలంటే ప్రాదేశిక, పంచాయతీ పోరులో నిలబడి గెలవా ల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉండడంతో భారతీయ జన తా పార్టీ కూడా జిల్లా వ్యాప్తం గా అన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఇక తమకు పట్టున్నచోట ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో వామపక్ష పార్టీలు కూడా ముందుకు సాగుతున్నాయి. 

గంగారం జడ్పీసిటీసి కీలకం..!

మహబూబాబాద్ జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానం ఈసారి జనరల్ కేటగిరికి కేటాయించారు. అయితే జిల్లాలో 18 జడ్పిటిసి స్థానాలు ఉండగా కేవలం గంగారం జడ్పిటిసి స్థానాన్ని మాత్రమే ఓసీ జనరల్ కు కేటాయించారు. గార్ల జడ్పిటిసి స్థానం ఓసి జనరల్ కు కేటాయించినప్పటికీ మహిళలకు రిజర్వ్ చేశారు. ఇక మిగిలిన 16 జడ్పిటిసి స్థానాల్లో బీసీలకు ఏడు జడ్పిటిసి స్థానాలను కేటాయించగా, బయ్యారం, మరిపెడ, తొర్రూరు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు.

గూడూరు, కొత్తగూడ, మహబూబాబాద్, నెల్లికుదురు స్థానాలను బిసి జనరల్ కు కేటాయించారు. ఇక మిగిలిన 9 స్థానాల్లో చిన్న గూడూరు, డోర్నకల్, ఇనుగుర్తి, కేసముద్రం, నరసింహులపేట, కురవి, సిరోల్ స్థానాలను ఎస్టీలకు కేటాయించగా, కురవి, ఇనుగుర్తి, కేసముద్రం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. జిల్లాలో దంతాలపల్లి, పెద్దవంగర స్థానాలను ఎస్సీలకు కేటాయించగా దంతాలపల్లి మహిళలకు కేటాయించగా, పెద్దవంగర జనరల్ కేటగిరికి కేటాయించారు.

ఫలితంగా జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానానికి పోటీపడే అగ్రకులాలకు సంబంధించిన వారు కచ్చితంగా ‘గంగారం’ స్థానం నుండి ఎన్నికల బరిలోకి నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గంగారం ఎస్టీ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో అక్కడ నుండి అగ్ర వర్ణాలకు చెందిన వారు పోటీ చేస్తే ఆదరిస్తారా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే స్థానికేతరులకు ఇక్కడ అవకాశం కల్పించకూడదని, తమకే అవకాశం కల్పించాలంటూ ‘గంగారం’ ప్రాంత నేతల నుండి ఇప్పటికే ఒత్తిడి పెరుగుతోంది. దీనితో గంగారం జడ్పిటిసి స్థానం ఇప్పుడు ప్రాదేశిక పోరులో కీలకంగా మారింది.