calender_icon.png 5 December, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విడాకులు తీసుకున్న అమ్మాయి.. లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి కథ

05-12-2025 01:28:20 AM

యంగ్ హీరో శ్రీనందు నటిస్తున్న తాజాచిత్రం ‘సైక్ సిద్ధార్థ’. ఈ చిత్రానికి వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్‌సుందర్‌రెడ్డి తుడి నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను హీరోయిన్ యామిని భాస్కర్ విలేకరులతో పంచుకుంది. 

‘నర్తనశాల’ తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఏం సినిమా, క్యారెక్టర్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు డైరెక్టర్ వరుణ్ ఫ్రెండ్ నాకు ఈ కథ గురించి చెప్పాడు. విడాకులు తీసుకున్న అ మ్మాయి, తనకు ఒక పిల్లాడు కూడా వుంటాడు. ఈ క్యారెక్టర్ చేస్తా వా అని అడిగారు. కొత్తగా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. -తర్వాత డైరెక్టర్ వరుణ్ కథ చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ క్యారెక్టర్ చేశాను. నటనకు చాలా స్కోప్ ఉంది. కచ్చితంగా ఈ సిని మా తర్వాత నాకు మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది. 

ఇందులో నా క్యారెక్టర్ పేరు శ్రావ్య. ఒక హానికరమైన రిలేషన్ నుంచి బయటకు వచ్చి స్వతహాగా బతకాలనుకుంటుంది. ఇదే సమయంలో సిద్ధార్థకు బ్రేక్ అప్ అయి ఉంటుంది. తను అన్నీ వదిలేసి ఒక బస్తీకి రావటంతో అక్కడ ఒక ప్రేమకథ మొదలవుతుంది. అందరూ రిలేట్ అయ్యే సహజమైన ప్రేమకథ ఇది.

ఈ సినిమా టీజర్ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత ‘అర్జున్‌రెడ్డి’తో పోల్చారు. -పోస్టర్ లుక్కు అలా ఉంటుందేమో కానీ ఈ కథకు ‘అర్జున్‌రెడ్డి’కి సంబంధం లేదు. అర్జున్‌రెడ్డి, సిద్ధార్థ.. ఈ రెండు క్యారెక్టర్లు పూర్తిగా విభిన్నం. 

నేను సినిమాను వోన్ చేసుకున్నా. ఈ సినిమా టైమ్‌లో నేను డైట్‌లో ఉండడం వల్ల ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకునేదాన్ని. కార్వాన్ అంటూ ఏమీ లేదు. లొకేషన్‌లోనే కూర్చుని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. 

నందు మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. సురేశ్‌బాబు ఈ సినిమా తీసుకోవడం మా అందరికీ పెద్ద సర్ర్పైజ్. రామానాయుడు స్టూడియోలో మా సినిమా పోస్టర్ చూసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ పోస్టర్ చూసి నేనూ, డైరెక్టర్ చాలా ఎమోషనల్ అయ్యాం. ఫొటోలు కూడా తీసుకున్నాం.

డైరెక్టర్ సాయిరాజేశ్ ఈ సినిమా చూసి నా క్యారెక్టర్ గురించి ప్రశంసించారు. ఇప్పట్నుంచి సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టమని నాకు సూచించారు. అయితే, -ఈ సినిమా టీజర్ చూసిన రోజే సినిమాల్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నా. మంచి క్యారెక్టర్ వస్తే ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తా.

నేను ‘కాటమరాయుడు’ సినిమాలో చేశా. తొలిరోజు నాకూ, పవన్‌కల్యాణ్‌కి ఒక సీన్ ఉంది. ఆ రోజు ఆయన నాతో దాదాపు 15 నిమిషాలు మాట్లాడారు. నా జర్నీ గురించి అడిగారు. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆ తర్వాత నేను ‘అజ్ఞాతవాసి’లోనూ చేశా. కానీ ఎడిటింగ్‌లో నా పాత్ర కట్ అయింది.