calender_icon.png 5 December, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖండ.. సమస్యల నడుమ తెరపైకి!

05-12-2025 01:26:36 AM

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ2’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరల పెంపుతోపాటు ప్రత్యేక ప్రీమియర్స్‌కూ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

ఈ విషయంలో కొన్ని షరతులు విధిస్తూ ఉత్తర్వురులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీఫ్లెక్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. గురువారం రాత్రి 8 గంటల షోకూ అనుమతిచ్చింది. దీనికి టికెట్ ధర రూ.600 (జీఎస్టీతో కలిసి)గా నిర్ణయించింది. అయితే, పెంచిన ధరలు మూడు రోజులే అమలయ్యేలా అనుమతులు జారీ చేసింది. 

ప్రీమియర్స్ రద్దు 

‘అఖండ౨’ చిత్రానికి సంబంధించి ప్రీమియర్స్ గురువారం రాత్రి ప్రారంభం కావాల్సి ఉంది. అనివార కారణాల వల్ల ప్రీమియర్స్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కొన్ని గంటల ముందే ప్రకటించడంపై సినీప్రియులను అసంతృప్తికి గురిచేసింది.  ప్రీమియర్ షోలు రద్దు వెనుక అసలు సంగతి వేరే ఉన్నట్టు తెలుస్తోంది.

14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాతలకు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని వినికిడి. గతంలో ఈ సంస్థ నిర్మించిన చిత్రాలకుగాను ఈరోస్ సంస్థకు ఇంకా రూ.28 కోట్లు చెల్లించాల్సి ఉందని సమాచారం. అందుకే ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. దీంతో మద్రాస్ హైకోర్టు ఈరోస్‌కి అనుకూలంగా వ్యవహరిస్తూ ‘అఖండ2’ రిలీజ్‌పై స్టే విధించింది.

‘అఖండ2’ విడుదలకు ముందే తమ డబ్బు చెల్లించాలని ఈరోస్ సంస్థ పిటిషన్‌లో పేర్కొంది. ఈరోస్ వాదనతో ఏకీభవించిన జస్టిస్ ఎస్‌ఎం సుబ్రహ్మణ్యం,  జస్టిస్ సీ కుమారప్పన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ‘అఖండ2’ రిలీజ్ ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. అందువల్లే తాజాగా 14 రీల్స్ ప్లస్ సంస్థ ‘అఖండ2’ ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మరి, శుక్రవారం సినిమా విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుపలేదు. శుక్రవారం థియేటర్లలో ‘ఆఖండ తాండవం’ చేస్తాడా..? పంచాయితీ తెగేదాకా వాయిదా బాట పడతాడా! అనే సందేహాన్ని సినీప్రియులు వ్యక్తం చేస్తున్నారు. 

ఆదాయంలో 20 శాతం సినీకార్మికులకు.. 

‘అఖండ2’కు సంబంధించి పెంచిన టికెట్ ధరల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు వెళ్లనుంది. చిత్ర పరిశ్రమలో సినీకార్మికుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఇందుకోసం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ప్రత్యేక బ్యాంకు ఖాతాను సైతం తెరువడం విశేషం. ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఖాతాను కార్మికశాఖ కమిషనర్ పర్యవేక్షిస్తారు.