calender_icon.png 22 October, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేమ పేరిట కోత విధిస్తే సహించం

22-10-2025 02:03:06 AM

-పత్తి కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ

-మద్దతు ధర పెంపుపై పార్లమెంటులో రాహుల్‌తో కలిసి పోరాటం

-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

-పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్‌లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

-  ఖమ్మం, అక్టోబరు 21 (విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొదట తిరుమలాయపాలెం మండలం గోల్ తండా గ్రామంలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి. లక్ష్మీబాయి తో కలిసి మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం పేరుతోగానీ, తరుగు పేరిట గానీ రైతులను అనవసరంగా ఇబ్బందులు పెట్టి మద్దతు ధరలో కోత విధిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులను, మిల్లు యజమానులను హెచ్చరించారు. ప్రస్తుత వానాకాలం సీజన్ 2025లో పాలేరు నియోజకవర్గంలో ప్రారంభమైన మొట్టమొదటి సీసీఐ కేంద్రం ఇదేనని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

కేంద్రం ప్రకటించిన ప్రస్తుత మద్దతు ధర రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని ఉద్ఘాటించారు. అందుకే, పత్తి ధరను పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాబోయే పార్లమెంటు సెషన్స్‌ల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సమన్వయం చేసుకుంటూ, పత్తికి మద్దతు ధర పెంపుపై తప్పకుండా చర్చను లేవదీసి, రైతులకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.రైతులు తమ పత్తిని ఎలాంటి ఆందోళన లేకుండా అమ్ముకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు. ప్రతి సీసీఐ కేంద్రం వద్ద వచ్చే అభ్యంతరాలను, ముఖ్యంగా తేమ శాతం విషయంలో రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు స్థానిక వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

రైతులకు అన్యాయం చేయాలని చూసే వారిపై ఈ కమిటీ తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ పరుగులు పెడుతోందని మంత్రి పొంగులేటి అన్నారు. ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో తూచా తప్పకుండా అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మంత్రి ఖమ్మం రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

కొండాపురం గ్రామంలో రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి మంత్రి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా తల్లంపాడు గ్రామంలో అత్యంత కీలకమైన ఖమ్మం-సూర్యాపేట ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి లక్ష్మీపురం మీదుగా తల్లంపాడు నుంచి తెల్దారుపల్లి వరకు రూ. 3 కోట్ల 58 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తల్లంపాడులో రూ. 35 లక్షలతో చేపట్టనున్న అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను కూడా ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పీఆర్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ యాకుబ్, జిల్లా వ్యవసాయ అధికారి జి. పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.