09-08-2025 01:12:54 AM
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
రాజేంద్రనగర్, ఆగస్టు 8 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే గొప్ప ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీసీ సెల్ కార్యాలయం, వ్యవసాయ కళాశాల అనుబంధ సెమినార్ హాల్ ను మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు మాట్లాడుతూ.. ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో బీసీ విభాగం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. బలహీన వర్గాల ప్రతినిధ్యానికి జరుగుతున్న పోరాటంలో రాజకీయ పార్టీలు మాత్రమే పాల్గొంటున్నాయని వివరించారు.
కులగణన జరిపిన తరువాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలు రిజర్వేషన్లు సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం మాదిరి అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ లో బీసీ విభాగం ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నామో, అదే విధంగా ప్రతి సంస్థ, ప్రతి ఉద్యోగుల సంస్థల్లో, కార్యాలయాల్లో బీసీ విభాగం ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విసి అల్దాస్ జానయ్య, బీసీ సెల్ ఇంచార్జి డాక్టర్ దామోదర్ రాజు, ప్రొఫెసర్లు, బీసీ సంఘాల విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.