calender_icon.png 9 August, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు తప్పని యూరియా తిప్పలు

09-08-2025 12:50:55 AM

  1. ఒక్క బస్తా కోసం రోజంతా పడిగాపులు 
  2. అధికారుల లెక్కలు కాగితాలకే పరిమితం
  3. కొరత పపేరుతో వ్యాపారుల దోపిడీ!
  4. విక్రయ కేంద్రాల వద్ద చెప్పులతో క్యూ

సిద్దిపేట, ఆగస్టు 8 (విజయక్రాంతి): సరఫరా లోపమా, వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరతనో తెలియదుకానీ రైతులకు యూరియా దొరకడం లేదు. తెల్లవారు లేవగానే విక్రయ కేంద్రాల ముందు చెప్పులు క్యూలో పెట్టి తమకు యూరియా అవసరాన్ని తెలియజేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత యూరియా కొరత ఏర్పడి, పాత పద్ధతి పునరావృతం అవుతున్నది.

ప్రతిపక్షాలు ఆరోపించినట్లే ప్రభుత్వ తీరు ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో అధిక మొత్తంలోనే యూరియా కొరత ఏర్పడింది. ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్‌చార్జి మంత్రికి అవసరమయ్యే యూరియా లెక్కలు అధికారులు పక్కాగా అప్పజెప్పారు. కానీ అధికారుల లెక్కలు కాగితాలకే పరిమితమయ్యాయి అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, నంగునూరు, చిన్నకోడూరు, దౌల్తాబాద్, రాయపోల్, జగదేవపూర్, బెజ్జంకి, దుబ్బాక మండలాల్లో తీవ్రమైన యూరియా కొరత ఉంది. ఈ మండలాల్లో రైతులు యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా యూరియాను విక్రయిస్తున్న వ్యాపారులు.. హమాలి పేరుతో రైతుల వద్ద అధిక ధర వసూలు చేస్తున్నారు. ఈ విషమయై వ్యవసాయ శాఖ అధికారులకు రైతులు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు సైతం సంఘాలకే వత్తాసు పలకడం గమనర్హం. 

అధిక ధరలకు అమ్మకం

యూరియా కొరతను అడ్డు పెట్టుకొని వ్యాపారులు అందిన కాడికి దండుకుంటున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాటుమాటున అధిక ధరలకు యూరియా బస్తాలు విక్రయించుకుంటున్నారు. రైతులు తప్పని పరిస్థితులలో అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయాల్సి వస్తుంది. పీఏసీఎస్, డీసీఎంఎస్ ద్వారా రూ.267 తోపాటు రూ.13 హమాలి పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు.

అయితే లారీల ద్వారా కేంద్రాలకు వచ్చిన యూరియా బస్తాలను గోదాంలోకి అన్లోడ్ చేసినప్పుడు, రైతులు వచ్చినప్పుడు వారి వాహనాల్లో లోడ్ చేసినప్పుడు ఇలా రెండింటికి కలిపి రూ.13 చెల్లించాల్సి ఉంటుంది. కానీ లారీ నుంచి నేరుగా యూరియా బస్తాలు రైతు భుజానికి అందిస్తున్నప్పటికీ హమాలి చార్జీ రూ.13 వసూలు చేయడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. ఈ విషయం అధికారు లకు చెబితే దబాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంఘాల అధికారులు, వ్యాపారులు యూరియా బస్తాలను అక్రమంగా నిలువ చేస్తూ ఒక బస్తాను సుమారు రూ.300కు పైగా విక్రయిస్తున్నారు. ఎకరం లోపు భూమి ఉన్న రైతుకు ఒక బ్యాగు, ఎకరం పైగా భూమి ఉన్న రైతుకు రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. దాంతో పంటకు పూర్తిస్థాయిలో ఎరువులు అందించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు సరిపడా యూరియాని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.