27-12-2025 03:19:04 AM
అమరావతి, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని 40వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల, బత్తలూరు గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.
కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారు. ఆరుగురు ప్రయాణిస్తున్న ఓ కారు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలు దేరింది. శుక్రవారం తెల్లవారుజామున కారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోకి రాగానే డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో కారు వేగంగా రోడ్డు డివైడర్‌ను దాటి, ఎదురుగా హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జును జ్జయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపో యిన మృతదేహాలను, క్షతగాత్రులను అతికష్టం మీద బయటకు తీశారు.
మృతులను హైదరాబా ద్‌లోని నిజాంపేట్‌కు చెందిన గుండేరావు, శ్రావణ్, నరసింహ, బన్నీగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, వారిని మరో వాహనంలో గమ్యస్థానాలకు పంపించామని అధికారులు తెలిపారు. కారుడ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కే ప్రమోద్‌కుమార్ ప్రమా ద స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.