27-12-2025 03:28:20 AM
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి) : రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఐఏ ఎస్ అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసిందా..? అంటే అవుననే తలూ పుతున్నారు ఐఏఎస్ అధికారవర్గాలు. కార ణం.. ఎంతో కీలకమైన స్థానాల్లోకి ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారులను తీసుకువస్తూ.. తమ నెత్తిపైన కూర్చుండబెడుతున్నారనే అసంతృప్తి ఐఏఎస్ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2023 డిసెంబరులో తెలంగాణలో పరిపాలనా పగ్గాలు చేపట్టిన అధికార కాంగ్రెస్ పార్టీ.. మొదటి నుంచి కొన్ని కీలకమైన అధికారిక స్థానాల్లోకి ఐపీఎస్ అధికారులను తీసుకొస్తోంది. ఇదికాస్తా ఐఏఎస్ అధికారవర్గాల కినుకకు కారణమవుతోంది.
ఆర్టీసీ, సివిల్‌సప్లు..
రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడంలో ఆర్టీసీ, సివిల్ సప్లు శాఖలది ఎంతో కీలకమైన పాత్ర. వాస్తవానికి ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (వీసీఎండీ) అయినా.. సివిల్ సప్లు కమిషనర్ అయినా.. చాలా కాలం క్రితం ఈ స్థానాల్లోకి ఐఏఎస్‌లకు అవకాశం ఉండేది. అయితే, కొంత కాలంగా మాత్రం ఐపీఎస్ అధికారులకే ఈ స్థానాలను అప్పజెప్పుతూ.. ఐఏఎస్ అధికారా లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
కొంత కాలం క్రితం సివిల్ సప్లు కమిషనర్ అండ్ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రెటరీగా సీనియన్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్‌ను నియమించారు. అటు తరువాత మరో సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత హోం శాఖ సెక్రెటరీ సీవీ ఆనంద్‌ను తీసుకొచ్చారు. ఆపై మరో ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌కు ఆ పదవిని అప్పగించారు. ఎట్టకేలకు తాజాగా ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు పగ్గాలు అప్పజెప్పారు. దీనితో సివిల్ సప్లు విభాగంపై తమ ఆధిపత్యం పోతుందనే చర్చ ఐఏఎస్‌లలో ఉండనే ఉంది.
అలాగే ఆర్టీసీని తీసుకుంటే..
సమైఖ్య రాష్ట్రంలో పలుమార్లు ఐఏఎస్ అధికారులకు అప్పగించిన ఆర్టీసీ వీసీఎండీ పదవిని అటు తరువాత మెల్లగా ఐపీఎస్ వైపు అప్పటి ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలను నిర్వర్తించారు. తాజాగా ప్రభుత్వం వీసీ సజ్జనార్‌కు హైదరాబాద్ కొత్వాల్ బాధ్యతలను అప్పగించి.. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి వై.నాగిరెడ్డికి ఆర్టీసీ ఎండీ బాధ్యతలు అప్పజెప్పింది. దీనితో ఐపీఎస్ అధికారులకే ఈ రెండు పోస్టులు అనేలా... ఒక సంప్రదాయంగా మారుతోందని ఐఏఎస్ అధికారుల్లో చర్చ జరుగుతోంది.
సింగరేణి పగ్గాలు కూడా..
ఇదిలా ఉండగా.. తాజాగా సింగరేణి సీఎండీగా ఉన్న ఎన్.బలరామ్ తన మాతృశాఖ అయిన ఐఆర్‌ఎస్ విభాగానికి వెళ్లిపోవడంతో తాత్కాలికంగా ఐఏఎస్ అధికారి అయిన కృష్ణభాస్కర్‌కు అప్పగించారు. అయితే ఆర్టీసీ, సివిల్ సప్లు మాదిరిగానే సింగరేణిని కూడా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి అప్పగిస్తే.. కాస్త అజమాయిషీ ఎక్కువ స్థాయిలో చెలాయించవచ్చనే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి. అంటే.. సీనియర్ ఐపీఎస్ అధికారికి సింగరేణి సీఎండీగా బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని, ప్రభుత్వం ఆ ఆలోచనలో ఉందని అప్పుడే ఐఏఎస్‌లలోనూ చర్చ మొదలయ్యింది.
అసంతృప్తిలో ఐఏఎస్ వర్గాలు..
వాస్తవానికి పరిపాలనలో కీలకమైన పాత్రధారులైన ఐఏఎస్‌లకు ప్రతి శాఖలోనూ హెచ్‌ఓడీ పోస్టును కేటాయిస్తూ ఉంటారు. అయితే, ఆయా శాఖలపై వచ్చిన ఆరోపణలు, అక్రమాలు, అవకతవకల నేపథ్యంలో కొన్నిసార్లు ఐపీఎస్ అధికారులకు అప్పగించి.. అవినీతి, అక్రమాలు, అవకతవకలను రూపుమాపే ప్రయత్నాలు గత ప్రభు త్వ హయాంలో.. సమైఖ్య రాష్ట్రంలోనూ జరిగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మాత్రం కొన్ని విభాగాలు పూర్తిగా ఐపీఎస్ అధికారుల చేతుల్లోకి వెళ్లా యని.. అందులో సివిల్ సప్లు, ఆర్టీసీలు ముందు వరుసలో ఉంటాయనేది స్పష్టమవుతోం ది.
ఈ కోవలోకే సింగరేణిని కూడా మళ్లించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే సంకేతాలు.. ఐఏఎస్ అధికారుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. నిజానికి శాంతిభద్రతల విషయంలో ఐపీఎస్ అధికారులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ.. వివిధ సందర్భాల్లో ఐఏఎస్‌లతో కలిసి సమన్వ్యంతో ముందుకు సాగేలా ప్రభుత్వం సూచనలు ఇచ్చేది. అయితే కొన్ని ఆర్టీసీ, సివిల్ సప్లు లాంటి కీలకమైన విభాగాలను ఐపీఎస్‌లకు అప్పగించడంతో.. ఐఏఎస్‌లు వారితో సమన్వయం చేసుకోలేకపోతున్నట్టుగా చర్చ జరుగుతోంది.
పైగా మొదటి నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ల మధ్య సమన్వయలోపం, ఆధిపత్యం పోరు ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సింగరేణిని కూడా ఐపీఎస్‌లకు అప్పగిస్తే.. ఇది ఐఏఎస్, ఐపీఎస్‌ల మధ్య ఆధిపత్య ధోరణికి మరింత ఆజ్యం పోసే అంశంగా మారే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది. తాము ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో శిక్షణ పొంది..
ఐపీఎస్‌లకంటే ఒకడుగు ముందుగా ఉంటామనే అభిప్రాయంతో ఉండే.. ఐఏఎస్‌లకు.. సింగరేణిపై ప్రభుత్వం ఆలోచిస్తుందనే విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోతుందనే గుసగుసలు వినపడుతున్నాయి. ఏదేమైనా.. సర్కారు తీసుకునే నిర్ణయాలు ఐపీఎస్, ఐఏఎస్‌ల మధ్య అంతర్గత పోరును మరింత తీవ్రం చేస్తాయా.. లేక సమన్వయం చేస్తాయా అనే ఉత్కంఠ మాత్రం సర్వత్రా నెలకొంది.