calender_icon.png 27 December, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్య నగరం!

27-12-2025 02:22:57 AM

  1. దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ 
  2. బాధ్యతలు చేపట్టిన 12 మంది జోనల్ కమిషనర్లు
  3. పాలన వికేంద్రీకరణే లక్ష్యంగా..
  4.   6 జోన్ల నుంచి 12కు.. 30 సర్కిళ్ల నుంచి 60కి పెంపు
  5. వార్డుల సంఖ్య 300.. నగర విస్తీర్ణం 2,053 చ.కి.మీ

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 26 (విజయక్రాంతి): విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ఖ్యాతిలో మరో కలికి తురాయి చేరింది. చుట్టుపక్కల ఉన్న 27 పురపాలికల విలీనం తో హైదరాబాద్ మెగాసిటీగా ఆవిర్భవించింది. విస్తీర్ణం, జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ రికార్డు సృష్టించింది. పరి పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ పరిధిని భారీగా పునర్వవ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా జోన్ల సంఖ్యను 6 నుంచి 12కు, సర్కిళ్లను 30 నుంచి 60కి, వార్డులను 150 నుంచి 300కు పెంచుతూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది.

నూతనంగా నియమి తులైన 12 మంది జోనల్ కమిషనర్లు శుక్రవారం కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. నగర విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 2,053 చదరపు కిలోమీటర్లకు పెరగడంతో ప్రజలకు పౌర సేవలను మరింత వేగంగా అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు. రాజేంద్రనగర్, గోల్కొం డ జోనల్ కార్యాలయాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. గోల్కొండ జోనల్ ఆఫీసును అబిడ్స్‌లో ఏర్పాటు చేశారు. మిగిలిన సర్కిల్ కార్యాలయాల్లోనే కొత్త జోనల్ ఆఫీసులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 

సమగ్ర అభివృద్ధి కోసమే :  కమిషనర్ కర్ణన్

పునర్వవ్యవస్థీకరణతో హైదరాబాద్ పాలనలో నూతన అధ్యాయం మొదలైందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అధికారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో జనాభా 1.34 కోట్లు దాటింది. పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం వంటి సేవలను వికేంద్రీకరించాం. కొత్తగా విలీనమైన ప్రాంతాలకు కూడా సిటీ స్థాయి సౌకర్యాలు అందుతాయి. వరదల నిర్వహణ, రవాణా వ్యవస్థల అభివృద్ధికి ఇకపై సమగ్ర మెట్రోపాలిటన్ ప్రణాళికలు రూపొందిస్తాం అని స్పష్టం చేశారు.

బాధ్యతలు చేపట్టిన జోనల్ బాసులు వీరే..

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శుక్రవారం 12 మంది ఐఏఎస్, సీనియర్ అధికారులు జోనల్ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. వారిలో రాజేంద్రనగర్- అనురాగ్ జయంతి, గోల్కొండ-జి. ముకుందరెడ్డి, కూకట్‌పల్లి-అపూర్వ్ చౌహాన్, శంషాబాద్- కె. చంద్రకళ, ఉప్పల్-రాధికా గుప్తా, సికింద్రాబాద్-రవి కిరణ్, ఖైరతాబాద్- ప్రియాంక అల, మల్కాజ్‌గిరి- సంచిత్ గంగ్వార్, శేరిలింగంపల్లి-బోర్కడే హేమంత్సహదేవ్రావు, కుత్బుల్లాపూర్- సందీప్ కుమా ర్ ఝా, ఎల్బీ నగర్-హేమంత్ కేశవ్ పాటి ల్, చార్మినార్-ఎస్. శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.