calender_icon.png 27 December, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార సంఘాలకు ఎన్నికలే ముద్దు

27-12-2025 03:03:18 AM

రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు 

  1. నామినేట్ విధానం వద్దు 
  2. రైతు సంఘాల హెచ్చరిక  

హైదరాబాద్, డిసెంబర్  26 (విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలకమండళ్లను నియమించే  ప్రతిపాదనలను ప్ర భుత్వం వెనక్కి తీసుకోవాలని రైతు సంఘా లు  డిమాండ్ చేస్తున్నాయి. రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న సొసైటీల ను.. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చవద్దని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం నామినేట్ చేసే చైర్మన్లు రైతులకు రుణాలు మంజూరు  చేయడంలో పక్షపాతం చోటుచేసుకునే ప్రమాదం ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు  రైతులు సం ఘంగా ఉన్న సహకారం సంఘం.. భవిష్యత్‌లో ప్రభుత్వ శాఖగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

 తెలంగాణలో 908  ప్రాథమిక వ్యవసాయ సహకార ( పీఏసీఎస్) సంఘాలు, 9 డీసీసీబీ ( జిల్లా సహకార బ్యాంకులు), 9 డీసీఎంఎస్‌లు  ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా  మండలాలు ఏర్పడటంతో అదనంగా మరో 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలను ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతమున్న  పీఏసీఎస్, డీసీసీబీలు, డీఎసీఎంస్ సొసైటీలను ఈ నెల 19న రద్దు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.  ఇప్పుడు వాటికి ఎన్నికలు నిర్వహిం చాల్సి ఉంది. 2019లో ఈ సొసైటీలకు ఎన్నికలు జరిగి పాలక మండళ్లు ఏర్పాటయ్యా యి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో వాటి పదవీ కాల పరిమితి ముగిసింది. ఆ తర్వాత ఆరు నెలల చొప్పున రెండుసార్లు ప్రభుత్వం ఆ యా సొసైటీల పదవీ కాలాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. అయితే సహకార చట్టం లో ఉన్న నిబంధలనకు అనుగుణంగానే ఎ న్నికయ్యే పీఏసీఎస్‌ల స్థానంలోనే.. రాష్ట్రవ్యాప్తంగా ‘నాన్ అఫిషియేల్  పీఏసీఎస్’లను కొత్త సంవత్సరంలో ఏర్పాటు చేయాలని, ప్రతి పీఏసీఎస్‌కు ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేసి, వారిలో నుంచే డీసీసీబీ, డీసీఎంస్, టె స్కాబ్ కమిటీలకు కూడా పాలకుల ఎంపిక జరిగేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. 

అయితే, ఈ సహకార  సొసైటీల్లో  సభ్యులుగా ఉన్న రైతులకే  ఓటు హక్కు ఉంటుం ది. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 13 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించి ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. అయితే ప్రభుత్వం ఈ సహకార సొసైటీలకు ఎన్నికల నిర్వహించకుండా.. నామినేటెడ్ విధానంలో పాలక మండళ్లను నియమించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం  వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను ప్ర భుత్వమే నామినెట్ చేస్తోంది. ఈ  నామినెట్ విధానాన్ని  పీఏసీఎస్‌లకు అమలుచేయాలనే ప్రతిపాదనను రైతులు, రైతు సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

సహకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తే.. సోసైటీలో ప్రతి సభ్యుడు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు హక్కు ద్వారా  ఎన్నుకునే పరిస్థితి ఉంటుందని, ఇక ప్రభుత్వమే నామినేట్ చేస్తే ఈ సొసైటీలకు ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సొసైటీల ద్వారా  రైతులకు స్వల్పకాలిక, మధ్యకా లిక రుణాల మంజూరుతో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ ఇన్‌పుట్‌లను సరఫరా చేస్తారు. అంతేకాకుండా రైతు ఉత్పత్తిచేసిన పంటను దళారీల ప్రమేయం లేకుండానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ధాన్యం సేకరణ చేస్తారు. రైతులకు ఎన్నో విధాలుగా సేవచేస్తున్న సొసైటీలను ప్రభు త్వం రాజకీయ పునరావాసానికి వాడుకోవద్దని రైతులు కోరుతున్నారు. 

ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం

సహకార శాఖ పాలకమండళ్లను నామినెట్ చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. రైతులు ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం నుంచి నామినేట్‌చేసే విధా నం వస్తే సొసైటీల్లో వ్యక్తుల ప్రధాన్యత పెరుగుతుంది. రైతులు ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. ఈ అలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకొని ఎన్నికలు నిర్వహించాలి. సొసైటీలకు పూర్తిస్థాయిలో పాలక వర్గం వస్తే.. రైతులు సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. సహకార సంఘాల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానిది లేదు. చట్టాల ప్రకారం రైతుల సొమ్ముతోనే సొసైటీలు ఏర్పడ్డాయి. కానీ, తమ కార్యకర్తలకు పదవులు ఇవ్వడం కోసం నామినేట్ చేయడం సరైంది కాదు. 

 టి. సాగర్, తెలంగాణ రైతు సంఘం

ఆలోచన విరమించుకోవాలి

ప్రాథమిక సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార సంస్థలకు కాంగ్రెస్ కార్యక ర్తలను నామినేట్  చేసి పాలకమండళ్లను ఏర్పాటుచేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి. రైతులు సమిష్టిగా కలిసి ఉండి.. తమ ప్రతినిధులను  ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం కొనసాగించాలి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను  సహకార సొసైటీలకు నామినెట్  చేసి సహకార వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నాలను చేయడటం అప్రజాస్వామికం. ప్రభుత్వం నామినేట్ చేసే ఆలోచనను వెనక్కి తీసుకోకపోతే సొసైటీల ముందు ఆందోళనలు తప్పవు అని హెచ్చరిస్తున్నాం.

 బొంతు రాంబాబు, 

రైతు సంఘం నాయకులు