calender_icon.png 27 December, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హోంవర్క్

27-12-2025 02:54:42 AM

కృష్ణా, గోదావరి సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సర్కార్ సన్నద్ధం 

  1. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ 
  2. జనవరి 1న ప్రజాభవన్‌లో నిర్వహణ
  3. నీటి రాజకీయాల్లో విమర్శల కంటే విధానాలే కీలకమంటున్న నిపుణులు

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి) : కృష్ణా, గోదావరి జలాల అంశం పై అసెంబ్లీ వేదికగా సమర్థవంతంగా చర్చించేందుకు అధికార పార్టీ సన్నద్ధమవుతోంది. అందుకు హోంవర్క్‌లో భాగం గా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా సాగునీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించనున్న ట్లు తెలుస్తోంది. దీనిపై జనవరి 1వ తేదీన ప్రజాభవన్‌లో విస్తృత స్థాయి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్ర జల విధానంపై ప్రభుత్వ వైఖరి, గత పాలనలో జరిగిన ని ర్ణయాలు, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై ఇందులో సమగ్రంగా వివరించను న్నారు.

ఈ ప్రజెంటేషన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హా జరుకానున్నట్టు సమాచారం. అసెంబ్లీలో జలాలపై జరిగే చర్చకు ముందుగా పార్టీ నేతలకు పూర్తి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజెంటేషన్‌లో కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకు ఉన్న హక్కు లు, ఆంధ్రప్రదేశ్‌తో కొనసాగుతున్న జల వివాదాల తాజా పరిస్థితి, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందున్న కేసుల స్థితి, గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన నష్టం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కొత్త ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములపై ప్రభుత్వ వైఖరి వంటి అంశాలను ప్రధానంగా వివరించనున్నారు.

అయితే, బీఆర్‌ఎస్ పాలన సమ యంలో జలాల విషయంలో జరిగిన రాజీలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒకే గళంతో మాట్లాడేందుకు ఈ ప్రజెంటేషన్‌ను కీలకంగా భావిస్తున్నారు. జనవరి 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా, గోదావరి జలాల అంశం ప్రధాన ఎజెండాగా మారనున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందస్తు సన్నాహాల్లో భాగంగా ఈ ప్రజెంటేషన్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

నీటి రాజకీయాలపై సంపూర్ణంగా..

కృష్ణా, గోదావరి జలాల అంశం మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారుతోంది. కాంగ్రెస్ నేతలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇవ్వనున్న ప్రజెంటేషన్ సాధారణ సమావేశం కాదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది అసెంబ్లీ చర్చలకు ముందు ప్రభుత్వ సన్నద్ధంగా పలువురు భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల సమక్షంలో జరుగనున్న ఈ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ నేతలందరికీ అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.

గత పాలనలో కృష్ణా, గోదావరి జలాల విషయంలో జరిగిన నిర్ణయాలపై రాజకీయంగా దాడి చేయడమే కాకుండా, కేంద్రం ముందు తెలంగాణ వాదనను మరింత బలంగా ఉంచాలనే వ్యూహం రచిస్తున్నది. అయితే భవిష్యత్తులో తెలంగాణకు నీటి భద్రత ఎలా కల్పించబోతున్నారు అన్న దానిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కృష్ణా, గోదావరి జలాల విషయంలో మాటలకే పరిమితం కాకుండా, ఫలితాలు చూపించగలిగితేనే ఈ ప్రజెంటేషన్‌కు నిజమైన విలువ చేకూరుతుంది. నీటి రాజకీయాల్లో విమర్శల కంటే విధానాలే కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.