27-12-2025 03:14:14 AM
అడుగడుగునా సమస్యలే..
* బాసర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ౧౦౦ కోట్లతో ప్యాకేజీని ప్రకటించింది. దానికి డీపీఆర్ రూపొందించినా, ఇప్పటివరకు ఆమోదం లభించడం లేదు. ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 42 కోట్ల నిధులు కూడా వెనక్కి వెళ్లాయి.
నిర్మల్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక స రస్వతి నిలయమైన జ్ఞానసరస్వతి బాసర అమ్మవారి ఆలయంలో ఆదాయం పెరిగినా వసతులు లేక భక్తులకు తిప్పలు తప్పడం లేదు. సరస్వతి క్షేత్రంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటే మంచి చదువులు వస్తాయని నమ్మే తల్లిదండ్రులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో తరలివస్తుంటారు. దీనితో రూ. కోట్లలో ఆదాయం వస్తున్నది.
ఏటా టెండర్ల ద్వారా మరో రూ. 28 కోట్ల ఆదా యం వస్తున్నది. ఇంత పెద్దమొత్తంలో ఆదాయం వస్తున్నా బాసరలో భక్తులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. ఆలయానికి ఏటా భక్తుల సంఖ్య పెరుగు తూ.. ఆదాయవనరులు పెరుగుతున్నప్పటికీ ఆ నిధులను భక్తుల వసతుల కోసం తగినస్థాయిలో ఖర్చుచేయడం లేదు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
400 మందికే అన్నదానం..
బాసరలో ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తున్నా, అది కేవలం 400 మందికే పరిమితం చేస్తున్నారు. దీంతో ఆలస్యంగా వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం దొరక్క ప్రైవేటు హోటళ్లలో భోజనం చేస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో 100 పడకల వసతిగృహంతో పాటు కొన్ని వీఐపీ గెస్ట్ హౌస్‌లు ఉన్నప్పటికీ అవి సాధారణ భక్తులకు అనుగుణంగా లేకపోవడంతో ప్రైవేటు లాడ్జిల్లో, గెస్ట్‌హౌస్‌లో ఉండాల్సి వ స్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు అభిషేకం, అర్చ న, పూజ వంటి కార్యక్రమాల నిర్వహణకు పూజారుల కొరతతో పాటు సిబ్బంది కొరత కూడా భక్తులను వేధిస్తున్నది.
స్నానపు గదుల్లేవు..
పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ముందుగా గోదావరిలో పుష్కరఘాట్‌ల వద్ద పుణ్యస్థానాలు చేస్తారు. అయితే పుష్కరఘాట్‌ల వద్ద బురద ఉండటం, స్నానపు గదులు తగిన స్థాయిలో లేకపోవడంతో పాటు షవర్లు పనిచేయక ఇబ్బంది పడుతున్నారు. గోదావరిలో ఏ ర్పాటుచేసిన బోటు ప్రయాణంలోనూ భక్తుల రక్షణకు కనీస చర్యలు చేపట్టడంలేదు. రక్షణ చర్యలు లేక ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు యువకులు గోదావరిలో ము నిగి ప్రాణాలు కోల్పోయారు.
అంతేకాకుండా ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నా యి. తగినన్ని మరుగుదొడ్లు, మూత్రశాలలు కూ డా లేవు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు దుకాణాలను ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్టీసీ బస్సులు ఆగేచోట కనీసం షెల్టర్ కూడా కరువైంది. రోడ్లపై పిల్లాపాపలతో గంటల తరబడి నిలబడుతున్నారు. ఏటీఎంలు ఉన్నా అవి పనిచేయవు.
సమాచార బోర్డులు లేకపోవడంతో చదువుకున్న వారు సైతం అక్కడ సదుపాలపై అడుక్కోవలసిన పరిస్థితి నెలకొంది. అమ్మవారి క్షేత్రంలో పులిహోర, లడ్డు, టోకెన్ల అమ్మకాల్లోనూ అక్రమాలు బయటపడ్డాయి. కల్తీ నెయ్యి భాగోతం కూడా గతంలో కలకలాన్ని సృష్టించింది. ఇటువంటి ఘటనలపై దేవాదాయ శాఖ చర్యలు చేపడుతున్నామని చెపుతున్నా, అవి కార్యరూపం దాల్చడం లేదు.
రైల్వేలైన్ ఉన్నా ఇబ్బందులే
బాసరలో రైల్వేలైన్ ఉన్నా సదుపాయాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. నవీపేట నుంచి బాసర వరకు రైల్వే లైన్ డబుల్ లైన్ పనులు పూర్తి అయ్యాయి. బాసర ఆర్టీసీ బస్టాండ్ గుంతలమయమయింది. గత వర్షాకాలం సీజన్లో గోదావరిలో వరద ఉప్పొంగి బాసర ఆలయం వరకు వరద నీరు చేరుకోవడంతో మూడు రోజులపాటు భక్తులు వ్యాపారులు, ఉక్కిరిబిక్కిరి అయ్యారు వరదల నివారణకు చర్యలు చేపట్టాలిలని భక్తులు కోరుతున్నారు.
100 కోట్ల ప్యాకేజీ ఏమైంది?
బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రూ. 100 కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. ఇందులో తక్షణం రూ. 49 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నాయని, దానికి సంబంధించిన డీపీఆర్‌ను తయారుచేయాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించడంతో అధికారులు తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించారు. దానికి ఇప్పటివరకు ఆమోదం లభించడం లేదు. ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 42 కోట్లు నిధులు కూడా వెనక్కి వెళ్లాయి.
పాలకవర్గంపై పట్టింపేదీ?
బాసర ఆలయ పాలకవర్గం ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడం నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనంగా భక్తులు చెప్పుకుంటారు. గత బీఆర్‌ఎస్ హయాంలో 2018లో పాలకవర్గాన్ని ఖరారుచేయగా 2020లో పాలక వర్గం కాల పరిమితి ముగిసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు గా కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయలేదు. దీంతో ఆలయ అభివృద్ధి కుంటుపడింది.