27-12-2025 03:24:25 AM
ముషీరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి) : కేంద్ర నిధులు, హైకోర్టు తీర్పులతోనే గ్రామపంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా చెప్పాడని, ఇప్పుడు మాట మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొనడాన్ని బీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ లోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ పై బీసీ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం మీడియాతో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు ఏ పార్టీకి అనుకూలంగా రాలేదని, బీసీల రాజకీయ చైతన్యంతో ప్రభంజనంలా జనరల్ స్థానాల్లో కూడా బీసీ సర్పంచులు గెలిచి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈనెల 29నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లేలా అసెంబ్లీ వేదికగా ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని అసెంబ్లీలో ప్రకటించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మాట మార్చి వ్యహరిస్తున్నాయన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఇంకొక వైపు బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు డిమాండ్ చేయడం చాలా సిగ్గుచేటన్నారు, బీసీ జేఏసీ అష్టంగా ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర బంద్ నిర్వహించడమే కాకుండా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేశామని ఇకనుంచి బీసీ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఈనెల 31వ తేదీన హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే బీసీల రాజకీయ చైతన్యంతో రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన 5,380 మంది బీసీ సర్పంచులతో సంక్రాంతి తర్వాత రాష్ట్ర ఆత్మీయ అభినందన సభను నిర్వహిస్తామని తెలిపారు.
ఫిబ్రవరి రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీసీల రథయాత్ర చేపడుతామని అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో లక్షలాది మందితో హైదరాబాద్‌లో ‘వేలవృత్తులు -కోట్ల గొంతులు‘ అనే నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించి బీసీల సత్తాను చాటి చెప్తామని ఆయన తెలిపారు. సమావేశంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ ఎం. బాగయ్య ప్రొఫెసర్ సంఘవి మల్లేశ్వర్, బీసీ జేఏసీ కో చైర్మన్ కాటేపల్లి వీరస్వామి, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ పిట్ల శ్రీధర్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. మని మంజరి, దీటి మల్లయ్య, జాజుల లింగం, మాధవ్ మేరు, నరాల సుధాకర్, గజ్జల సత్యం, తారకేశ్వరి, ఉదయ్ నేత, శివమ్మ, వెంకటేష్ గౌడ్, గూడూరు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు