calender_icon.png 27 December, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం

27-12-2025 02:41:01 AM

  1. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల స్థాపన
  2. ఆదిలాబాద్ -ఆర్మూర్ రైల్వేలైన్ సర్వే నడుస్తోంది
  3. మంచిర్యాలకు గ్రీన్ ఫీల్డ్ హైవే..
  4. తెలంగాణలో విమానాశ్రయాల సంఖ్య పెంచుతాం
  5. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

ఆదిలాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, మారుమూల జిల్లాలో సైతం మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో విమానాశ్రయాల సంఖ్యను పెం చేందుకు కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉందని, అలాగే త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఆదిలాబాద్  రైల్వేలైన్ సర్వే నడుస్తోందని, మంచిర్యాలకు గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తోందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.23.75 కోట్లతో రిమ్స్‌లో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మన విద్యార్థులు వైద్యవిద్య కోసం ఇతర దేశాలకు వెళ్తున్నారని, అలాంటివి జరగకుండా దేశంలోనే నాణ్యమైన వైద్యవిద్యను అందించేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నార ని తెలిపారు. ఇందుకు ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల స్థాపించడంతో పాటు మెడిక ల్, పీజీ సీట్లు పెంచేలా యోచిస్తున్నారని పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వం ప్రస్తు తం1.50 లక్షల కోట్లతో జాతీయ రహదారులను నిర్మిస్తోందని, మరో రూ.80వేల కోట్ల తో పైప్‌లైన్ పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి సడక్ యో జన కింద ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాలకు రోడ్లు వేసినట్లు తెలిపారు. మంచిర్యాలకు గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తోందని.. ఆదిలాబాద్  రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో రూ.1.20కోట్లు.. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లతో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మించిందని తెలిపారు. రానున్న రోజుల్లో మన ప్రాంతంలోనే మంచి హాస్పిటళ్లు అందుబాటులోకి వస్తాయని.. రంగు మారి న సోయా పంట కొనుగోలు విషయమై ఆ శాఖ మంత్రితో మాట్లాడి కొనుగోలు చేసేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పత్తి పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.

రాజకీయాలు స్నేహ పూర్వకంగా ఉండాలి

 రాజకీయాలు స్నేహ పూర్వకంగా ఉండాలని.. గతంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో భారత ప్రతినిధిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు వాజ్ పేయిని ఐక్యరాజ్య సమితికి పంపించారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. గతంలో రామగుండంకు ప్రధాని వస్తే ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనలేదని తెలిపారు. అలాంటి రాజకీయాలు మంచివి కావని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ లు మల్క కొమురయ్య, దండే విఠల్, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాల చారి, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంఎచ్‌ఓ నరేందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టును త్వరగా వినియోగంలోకి తేవాలి

కిషన్‌రెడ్డిని కోరిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ఇతర జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహతో మాట్లాడి జిల్లాకు అవసరమైన వైద్యులను నియమించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టును త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని.. కొంతైనా నిరుద్యోగ సమస్య తీరుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని జూపల్లి కృష్ణారావు కోరారు.  క్రీడలకు సంబంధించి ఇంప్రూవ్ చేయాలని.. రంగు మారిన సోయా పంటను కేంద్రం కొనుగోలు చేయాలని కోరారు. 

 త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం

ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు స్థలాన్ని పరిశీలించిన కిషన్‌రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెండింగ్‌లో ఉన్న ఎయిర్ పోర్ట్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు ఏడు విమానాశ్రయాలు ఉంటే తెలంగాణలో కేవలం హైదరాబాద్‌లో ఒకే ఒక్కటి ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో విమానాశ్రయాల సంఖ్యను పెంచేందుకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక ఎయిర్‌పోర్టు మైదానాన్ని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి సందర్శించారు.

విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్మాణ స్థలం మ్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ...  ఈ విమానాశ్రయం నిర్మాణం ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం అని, ఈ ప్రాజెక్టు పూర్తి కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలన్నింటినీ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే, ఈ ప్రాంత ప్రజల రవాణా, వ్యాపార అవసరాలు తీరుతాయన్నారు. ఈ విమానాశ్రయం భవిష్యత్‌లో ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగానికి ఊతమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎస్పీ అఖిల్ మహాజన్, విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన ఇంజినీర్లు, ఆర్డీఓ స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.