calender_icon.png 1 February, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనసున్న మనసార్!

01-02-2026 12:27:37 AM

‘ఉపాధ్యాయ వృత్తి అంటే జీతం, ఉద్యోగ భద్రత, సెలవుల లెక్కలతో మాత్రమే కొలిచే రోజులు ఇవి. పాఠశాలకు ఇలా వెళ్లామా అలా వచ్చామా అనేలా నడుచుకుంటూ.. ప్రభుత్వ జీతం పొంది, విద్యార్థుల పాఠాలు పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ద్వారా అక్రమ సంపాదనకు దృష్టి సారిస్తున్న పరిస్థితులు ఇవి.

కానీ ఆ తరగతి గదిలోనే తన జీవితం, తన లక్ష్యం, తన ఆనందం చూసుకున్న ఓ ఉపాధ్యాయుడు.. విద్యాబుద్ధులు నేర్పుతూ.. చదువు విలును నూరిపోస్తూ.. ఆర్థికంగా చేయూతనిస్తూ.. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఎందోరో విద్యార్థులకు, తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తున్న.. మనసున్న ‘మన్సూర్’ మాస్టారుపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..’

  1. తాను పడ్డ కష్టం మరేవిద్యార్థి పడకూడదని తపన
  2. ఒక సెలవు కూడా తీసుకోకుండా విద్యా బోధన
  3. విద్యార్థుల భవిష్యత్.. తరగతి గదే తన జీవితంగా
  4. ఆదర్శంగా నిలుస్తున్న హిందీ మాస్టారు

కల్వకుర్తి (విజయక్రాంతి) : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన అహ్మదుద్దీన్ జహంగీర్ బీ దంపతులకు మన్సూర్ రెండో సంతానం. తాను నాలుగో తరగతి చదువుతున్న కాలంలో నాన్నను పోగొట్టుకున్నాడు. ఆ నాన్న అటెండర్ ఉద్యోగాన్ని తన అన్న అమినుద్దిన్‌కు ఇచ్చారు. చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్న మన్సూర్ చదువు పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. వంగూరు మం డలం రంగాపూర్ గ్రామంలో స్కూల్ టాపర్ అయ్యాడు.

ఇంటర్‌లో అమ్మను కూడా పోగొట్టుకున్న తాను రాత్రీ పగలూ కష్టపడి 2007లో పీజీ (ఉస్మానియా యూనివర్సిటీ)లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2008 డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న సమయంలో తన అన్నను కూడా పోగొట్టుకున్నాడు. దీంతో 1.50 మార్కుల తేడాతో మిస్ అయ్యాడు. అనంతరం కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్‌గా హిందీ విభాగంలో మెరి ట్ సాధించి మెదక్ జిల్లా చిన్న శంకరంపేట కళాశాలలో జేఎల్‌గా పనిచేశాడు. ఎనిమిది మంది విద్యార్థులు ఉన్న నా కళాశాలలో 80 మంది కి పైగా చేరే విధంగా నిత్యం కళాశాలకు వెళ్లి విద్య అందించారు.

మరో ప్రయత్నంలో 2012లో డీఎస్సీ సాధించాడు. చారగొండలో మొదటి పోస్టింగ్ తెలుగు పండిట్‌గా పనిచేశారు. అనంతరం 2017లోని టీఆర్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి ర్యాంకు సాధించారు. అనంతరం 2021లో కల్వకుర్తి మండలం రఘుపతిపేట పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పనిచేశారు. అనంతరం సాధారణ బదిలీల్లో భాగం గా 2024 జూన్ నుంచి మార్చాల పాఠశాలలో పనిచేస్తున్నారు. విద్యార్థులకు విద్యను అందించే క్రమంలో తన జీవిత సత్యాలను విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ అత్యంత నిరుపేద విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా మెరుగైన ఫలితాల కోసం తపిస్తున్నారు.

ప్రతి రోజూ విద్యార్థుల ముఖాల్లో ఆత్మవిశ్వాసం

ప్రతి రోజూ తరగతి ప్రారంభమయ్యే వేళ విద్యార్థుల ముఖాల్లో ఆత్మవిశ్వాసం వెలిగించడమే లక్ష్యంగా పుస్తకాల్లోని పాఠాలే కాకుండా, తన జీవిత అనుభవాలను కూడా విద్యార్థులతో పంచుకుంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు. సాధారణంగా వార్షిక పరీక్షలంటే విద్యార్థుల్లో భయం, ఒత్తిడి సహజం అలాంటి వారికీ కూడా సులువుగా సమాధానాలు నేర్చుకునేలా ప్రత్యేక మెటీరియల్ తయారు చేసి అందిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నారు.

దూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కళ్లలో ఆకలి కనిపించిన రోజులు కూడా ఉన్నాయి. ఆ ఆకలి చదువును ఓడించ కూడదన్న సంకల్పంతో సొంత డబ్బులతోనే అల్పాహారం ఏర్పాటు చేసి ముందుగా ఆకలి తీర్చిన తర్వాతే చదువుకు దారి చూపారు. అది చిన్న పని కావొచ్చు.. కానీ ఆ పిల్లల జీవితాల్లో అదిపెద్ద ఆశగా మారింది.

నాలుగేళ్లుగా సెలవు తీసుకోలే..

ప్రభుత్వం ప్రతి ఉపాధ్యాయుడికి ఎలాంటి వేతనం కోత లేకుండా నెలకు కొన్ని సెలవులు కేటాయిస్తుంది. వాటిని వివిధ సందర్భాల్లో ఉద్యోగులు వాడుకుంటారు. కానీ మన్సూర్ మాస్టర్ మాత్రం వరుస గా నాలుగు సంవత్సరాలుగా ఒక్క సెలవును కూడా వినియోగించుకోకుండా విధులకు హాజరవుతూ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ప్రేరణ కల్పిస్తున్నారు. అలసట కనిపించినా వెనుకడుగు వేయలేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంతో ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఆ వృత్తికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలనే ఆలోచనే ఆయనను ముందుకు నడిపించింది.

ఈ త్యాగానికి ప్రతిఫలం ధనమో, పదవో కాదు.. విద్యార్థుల విజయం, తల్లిదం డ్రుల నమ్మకం, గ్రామస్తుల గౌరవమే ఆయనకు నిజమైన పురస్కారం. ‘మనకు మనసున్న మాస్టారు ఉన్నారు.వృత్తిని వదలకుండా, విలువలతో జీవిస్తున్నారు. నిశ్శబ్దంగా తరతరాల భవిష్యత్‌ను మలిచే నిజమై న హీరోగా నిలుస్తున్నారు’ అని విద్యార్థులు ఆనందంతో ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థుర్యైంతో పేర్కొంటున్నారు.