calender_icon.png 1 February, 2026 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవంతంగా ఆపరేషన్ స్మైల్

01-02-2026 12:25:06 AM

  1.   5,582 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు
  2. వివరాలు వెల్లడించిన అదనపు డీజీపీ చారుసిన్హా 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 31 (విజయక్రాంతి): రాష్ర్టంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, అదశ్యమైన చిన్నారుల ఆచూకీ కనుగొనడమే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్’ అద్భుతఫలితాలను సా ధించింది. జనవరిలో సాగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,582 మంది చిన్నారులను పోలీసులు సురక్షితం గా రక్షించారు. ఈ మేరకు మహిళా భద్ర తా విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా శనివారం ఒక ప్రకటనలో ఆపరేషన్ వివరాలను వెల్లడించారు.

చిన్నారుల అక్రమ రవాణా, వెట్టిచాకిరీ రహిత రాష్ర్టంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తోందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో జనవరి 1 నుంచి 31 వరకు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో 121 సబ్‌డివిజన్ పోలీసు బృందాలు మొత్తం 605 మంది సిబ్బందితోపాటు మహిళా శిశు సంక్షేమ, కార్మిక, ఆరోగ్య శాఖలతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, టీస్టాళ్లే లక్ష్యంగా ము మ్మర తనిఖీలు చేపట్టారు.

రక్షించబడిన 5,582 మంది చిన్నారుల్లో 5,108 మంది బాలురు, 474 మంది బాలికలు ఉన్నారు. వీరిలో రాష్ర్టం వారే కాకుండా బీహార్, యూపీ, ఒడిశా, ఏపీ సహా సుమారు 15 రాష్ట్రాలకు చెందిన 2,292 మంది వలస చిన్నారులు ఉండటం గమనార్హం. పొరుగు దేశమైన నేపాల్‌కు చెందిన 43 మంది చిన్నారులకు కూడా విముక్తి కల్పించారు. రక్షించిన వారిలో అత్యధికులు 4,567 మంది బాలకార్మికులు, 486 మంది వీధి బాలలు, 38 మంది భిక్షాటన చేస్తున్న వారు, మరో 491 మంది ఇతర పనుల్లో మగ్గుతున్నట్లు గుర్తించారు.

పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు

చిన్నారులతో పనులు చేయిస్తున్న వారి పై పోలీసులు కఠినచర్యలు తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 1,480 ఎఫ్‌ఐఆర్లను నమోదు చేసి, 1,483 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కార్మికశాఖ ద్వారా 1,363 తనిఖీ నివేదికలు జారీచేసి, కనీస వేతనాల చట్టం కింద నిందితులకు రూ.41.78 లక్షల భారీ జరిమానా విధించారు. రక్షించిన చిన్నారుల భవిష్యత్‌పై పోలీసుశాఖ ప్రత్యేక దష్టి సారించింది. 4,978 మందిని కౌన్సిలింగ్ అనంతరం వారి తల్లిదండ్రుల వద్ద కు చేర్చారు. ఆశ్రయంలేని 604 మందిని వివిధ రక్షణ గృహాలకు తరలించారు. వీరిలో 29 అర్బన్ బ్రిడ్జ్ స్కూళ్లలో 2,375 మందిని చేర్పించి వారికి విద్యావకాశం కల్పించినట్లు అదనపు డీజీపీ చారుసిన్హా వివరించారు.