calender_icon.png 15 November, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దత్తత దరఖాస్తులను తేల్చండి

01-12-2024 02:06:35 AM

బాలల సంరక్షణ కమిటీకి హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): చట్టవిరుద్ధంగా దత్తత పేరుతో కొనుగోలు చేశారంటూ పోలీసులు స్వాధీనం చేసుకున్న పిల్లల సంరక్షణకు సంబంధించి రెండు వారాల్లో నిర్ణయం తీ సుకోవాలని బాలల సంరక్షణ కమిటీని హైకోర్టు ఆదేశించింది.

దత్తత కోసం తల్లిదండ్రులు పెట్టుకున్న దరఖాస్తులపై అధికారులు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది. అక్రమం గా దత్తత తీసుకున్న పిల్లలను చట్టప్రకారం తల్లిదండ్రులకు అందజేయాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీ ళ్లు దాఖలు చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. దత్తత పేరుతో పిల్లల విక్రయం జరుగుతోందంటూ మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు. ఫీర్జాదిగూడలోని రామకృష్ణానగర్ కాలనీలోని డాక్టర్ శోభారాణి.. రోజులు, నెలల వయసున్న చిన్నారులను రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు విక్రయిస్తోందని సాయికుమార్ అనే జర్నలిస్టు నిర్వహించిన స్టింగ్ ఆప రేషన్ ఆధారంగా కేసు నమోదైందని చెప్పారు.

పోలీసులు సోదాలు నిర్వహించి 15 మంది పిల్లలను స్వాధీనం చేసుకుని, బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారని పేర్కొన్నారు. దత్తత పేరుతో పిల్లలను కొనుగోలు చేశారని, చట్టబద్ధంగా దత్తత జరగలేదన్నారు. దత్తత తల్లి దండ్రుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపి స్తూ.. పిల్లలను స్వాధీనం చేసుకునే హక్కు పోలీసులకు లేదన్నారు.

చట్టబద్ధంగానే తాము దత్తత తీసుకున్నామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం చట్టం ఉద్దేశాన్ని పరిగణనలోకితీసుకుని బాలల సంరక్షణ కమిటీలో ఉన్న చిన్నారుల కస్టడీకి భంగం కలిగించలేమని పేర్కొంది. వీరి సంరక్షణపై కమిటీ రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ అప్పీళ్లపై విచారణను కోర్టు మూసివేసింది.