calender_icon.png 12 January, 2026 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమకొండలో ఓసీల సింహగర్జన

12-01-2026 01:48:07 AM

  1. ఓసీల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా
  2. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్, జవవరి 11 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కేంద్రంలో ఓసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదా నంలో సింహగర్జన సభ నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓసీల డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. అన్ని వర్గాలు, అన్ని కమ్యూనిటీల సమావేశాలకు హాజరవుతున్నామని, అదే విధంగా ఓసీల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. ఓసీల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరగేలా ప్రయత్నిస్తానన్నారు.

క్రిమిలేయర్ ప్రవేశపెట్టి దాన్ని ఆమోదిస్తే అన్ని కులాలలో అన్ని వర్గాలకు అన్ని కమ్యూనిటీలకు సరైన న్యాయం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే టి రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ఎవరు కోరకున్నా ప్రధాని మోదీ ఈబీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా ఓసీలకు కొంత ఊరట కల్పించారని అన్నారు. వరంగల్ ఆర్యవైశ్య జేఏసీ సాధన కమిటీ కన్వీనర్ గట్టు మహేష్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న రిజర్వేషన్ల కారణంగా ఉద్యోగాలు రావడం లేదన్నారు. రానున్న రోజుల్లో ఓసీలు ఒక తాటిపై ఉండి హక్కులు సాధించుకోవాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఓసి ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఓసి జేఏసీ కన్వీనర్ గోపు జైపాల్‌రెడ్డి, గంగు ఉపేంద్ర శర్మ, దుబ్బ శ్రీనివాస్, ఓసి జేఏసీ గంధే శ్రీనివాస్ గుప్త ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా కోశాధికారి, తాడిచెట్టి పశుపతి ఓసి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్, నడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ.. ఓసీల సింహగర్జన భారీ బహిరంగ సభకు వచ్చిన ఓసీ కుల బంధువులకు, ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కులసంఘాల నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఓసీ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.