calender_icon.png 28 November, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణం ఇప్పిస్తానని లక్షలు వసూలు చేసిన కేటుగాడు

28-11-2025 01:13:09 AM

  1. ఆత్మహత్యకే సిద్ధమన్న బాధితులు 

అశ్వాపురంలో కలకలం

అశ్వాపురం, నవంబర్ 27 (విజయక్రాంతి):మండల కేంద్రంలో గురువారం ఉదయం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లోన్లు ఇప్పిస్తానని కోట్ల ఆశలు చూపెట్టి, లక్షల రూపాయలు వసూలు చేసిన గొడ్డుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి ముందు పలువురు బాధితులు పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగడంతో ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగింది. గోపాలపురం గ్రామానికి చెందిన తాటి భూదేవమ్మ, పాయం ధనలక్ష్మి, బూర్గంపాడు మండలం ఇరవండి గ్రామానికి చెందిన కనితి లలిత, పాల్వంచ మండలానికి చెందిన చల్ల రామచంద్రం లు మాట్లాడుతూ ట్రైకార్ దళిత బంధు లోన్లు, ట్రాక్టర్ లోన్లు ఇప్పిస్తానని నమ్మబలికి మా నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. మా జీవితాలు నాశనమయ్యాయి.

డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాం అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుల భావోద్వేగ నిరసనతో ఆ ప్రాంతం హల్చల్ అయ్యింది. అకస్మాత్తుగా పెట్రోల్ బాటిళ్లు చేతబట్టడంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. తర్వాత వారందరిని అశ్వాపురం పోలీస్ స్టేషన్కు తరలించి ఫిర్యాదులు స్వీకరించారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ పథకాల పేరిట అమాయకులను మోసం చేసే ఇటువంటి ఘటనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్‌చేస్తున్నారు.