07-01-2026 12:00:00 AM
మల్కాపూర్ తూము నుంచి కాలువలకు నీటి విడుదల
కొండాపూర్, జనవరి 6 : రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకొని వరి పంటలు సజావుగా సాగు చేసుకునే విధంగా మల్కాపూర్ తూము ద్వారా కలువలకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రైతుల్లో ఆనందం నింపింది. ఈ సందర్భంగా గ్రామ సెక్రటరీ రఘువీర్ గౌడ్ మాట్లాడుతూ, వ్యవసాయం గ్రామ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని, రైతులకు అవసరమైన నీటిని సమయానికి అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, రైతుల అవసరాలను గుర్తించి నీటి విడుదల చేపట్టడం జరిగిందని, ఈ నీటితో పంటలకు జీవం పోసినట్లవుతుందని అన్నారు. ఉప సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతూ, గ్రామంలోని సాగుభూములకు సమృద్ధిగా నీరు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు అనంతయ్య, అజ్గర్, లక్ష్మణ్, పహిం, శ్రీశైలం, నరేష్, సందీప్ గౌడ్, నారాయణ చారి, ప్రవీణ్, అనిల్, రత్నం, దశరథ్, వెంకట్లతో పాటు ఇరిగేషన్ అధికారులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు మాట్లాడుతూ, సరైన సమయంలో నీటి విడుదల చేయడం వల్ల పంటలు బాగా పండే అవకాశాలు మెరుగయ్యాయని, ఇందుకు గ్రామ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం మల్కాపూర్ గ్రామంలో వ్యవసాయాభివృద్ధికి మరో ముందడుగుగా నిలిచిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.