calender_icon.png 9 January, 2026 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేం

09-01-2026 01:12:21 AM

అమన్‌ప్రీత్‌సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురు

తీర్పు ఈ నెల 19కి వాయిదా

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టివేయాలని  కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అమన్ అభ్యర్థనను ధర్మా సనం తోసిపుచ్చింది. తదుపరి తీర్పును ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో భారీగా కొకైన్, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.

ఈ కేసులో అరెస్టయిన నిందితులను విచారించగా అమన్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. పోలీసులు ఆయన్ను ఈ కేసులో 7వ నిందితుడి చేర్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని కోరుతూ అమన్ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో ఇరుపక్షాల న్యాయవాదు లు తమ వాదనలను బలంగా వినిపించారు. అమన్ తరఫు న్యాయవాది తన క్లయింట్ అమన్ ప్రీత్ సింగ్ మాదకద్రవ్యాల వినియోగదారుడు మాత్రమేనని, విక్రేత కాదని కోర్టుకు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగానే అమన్ పలువురికి నగదు బదిలీ చేశారని, వాటిని డ్రగ్స్ కొనుగోలుగా పోలీసులు పొరబడుతున్నారని వాదించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు అమన్ సిద్ధంగా ఉన్నారని, పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు.

పోలీసుల తరఫున ఏపీపీ జితేందర్ వాదనలు వినిపిస్తూ.. అమన్‌కు డ్రగ్స్ విక్రేతలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. గత ఏడాది జూన్ నుంచి అమన్, పెడ్లర్ల మధ్య అనుమానాస్పద నగదు లావాదేవీలు జరిగాయని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితుడికి ఉపశమనం ఇవ్వకూడదని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు అమన్ ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసుల విచారణ కొనసాగాల్సి ఉందని అభిప్రాయపడింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తూ, తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.