calender_icon.png 3 November, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఎస్‌ఎల్‌బీసీ’పై ముందడుగు

03-11-2025 01:48:06 AM

పనుల్లో వేగానికి నేటి నుంచి ఏరియల్ ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వే

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

సొరంగం పూర్తయితే గ్రావిటీ ద్వారా నీటి తరలింపు

ఏటా ఆదా కానున్న విద్యుత్ బిల్లుల ఖర్చు రూ.500కోట్లు 

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాం తి) : ఎస్‌ఎల్‌బీసీ(శ్రీశైలం సొరంగ మార్గం) పనుల వేగవంతానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయబోతోంది. అందులో భాగంగా సోమవారం నుంచి ఎస్‌ఎల్‌బీసీ పనుల కోసం ఏరియల్ ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వేను చేపడుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఈ సర్వేను ప్రారంభించనున్నా రు. సొరంగం నిపుణుల సలహా మేరకు రా ష్ర్ట ప్రభుత్వం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో హెలికాప్టర్ ఆధారిత వీటెమ్ ప్లస్ మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను మంజూరు చేసింది.

ఈ సర్వేలో 24 మీటర్ల వ్యాసం కలిగిన ఒక ప్రత్యేకమైన ట్రాన్స్‌మీటర్ లూప్‌ను హెలికాప్టర్‌కు వేలాడదీసి, సొరంగం మార్గంలో 200 కి.మీ.లకు పైగా ఎగురవేస్తారు. ఇది భూమిలోకి విద్యుదయస్కాంత సంకేతాలను పంపి, 800,-1000 మీటర్ల లోతున ఉన్న భూగర్భ సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సమాచారం మిగిలిన మార్గంలో ఉన్న ఏవై నా చీలిక ప్రాంతాలు లేదా చిక్కుకున్న నీటి వనరులను గుర్తించడానికి సహాయపడుతుంది. తద్వారా తవ్వకం పద్ధతిలో మా ర్పులు చేసి, సురక్షితంగా వేగంగా పనులు కొనసాగించడానికి వీలవుతుంది.

ఈ మేరకు ప్రభుత్వం భారతదేశంలోని ప్రముఖ సొరం గ, రాక్ మెకానిక్స్ ఇంజినీర్లతో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందు కు ఇండియన్ ఆర్మీ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్‌ను ప్రత్యేక సలహాదారుగా, కల్నల్ పరీక్షిత్ మెహ్రాను సొరంగ నిపుణుడిగా ఏడాదిపాటు నియమించింది. అయితే సర్వేలో భా గంగా ఎలక్ట్రోమాగ్నటిక్ లూప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. అలాగే సర్వే హెలికాప్టర్‌లోని డేటా అక్విజిషన్ సిస్టమ్‌ను పరిశీలి స్తారు.

అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో ఎలక్ట్రోమాగ్నటిక్ లూప్ తో కూడిన సర్వే హెలికాప్టర్ టేకాఫ్ అవుతుంది. మధ్యాహ్నం 2:10 గంటలకు ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్ టేకాఫ్ అవుతుంది. ముఖ్యమంత్రి హెలికాప్టర్ సర్వే హెలికాప్టర్‌తో స మాంతరంగా ప్రయాణిస్తుంది. 2:30 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు తిరిగి ప్ర యాణమవుతారు. 3:10 గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో హెలికాప్టర్ ల్యాం డ్ అవుతుంది. 

ఆదినుంచి అనేక సవాళ్లు..

ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. అక్టోబర్ 2009లో వరదల వల్ల టీబీఎం నీట మునగడం, భూగర్భంలో అపాయకరమైన ప్రాంతాల కారణంగా పురోగతి నెలకు కేవలం 75 మీటర్లు మాత్రమే ఉంది. ము ఖ్యంగా 2025 ఫిబ్రవరి 22న సంభవించిన భయంకరమైన భూగర్భ ప్రమాదంలో నీరు, బురద, శిథిలాలు సొరంగంలోకి ప్రవేశించి 2.5 కి.మీ మేర మునిగిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు, సురక్షితమైన, స్థిరమైన పురోగతి కోసం అధునాతన సొరంగ తవ్వకం పద్ధతులను ఉప యోగించాలని తెలంగాణ క్యాబినెట్ అక్టోబర్ 23న ఆమోదించింది. 2028 మధ్య కల్లా సొరంగం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. 

ఫ్లోరైడ్ నిర్మూలనే లక్ష్యంగా.. 

నల్లగొండ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలలో 3లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు అందించడానికి 1983లో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నదే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం. ఈ సొరంగం మొత్తం పొడవు 43.93 కిలోమీటర్లు. మధ్యలో ఎటువంటి అంతరాయ మార్గాలు లేకుండా తవ్విన ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగంగా ఇది రికార్డు సృష్టించనుంది. అయితే.. ప్రస్తుతం శ్రీశైలం (ఇన్‌లెట్) నుంచి సుమారు 13.94 కి.మీ, దేవరకొండ (అవుట్‌లెట్) వైపు నుంచి 20.4 కి.మీ తవ్వకం పూర్తయింది.

ఇంకా సుమారు 9.8 కి.మీ తవ్వాల్సి ఉంది. సొరంగం పనులు పూర్తయితే నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీటిని పంప్ చేయడానికి రాష్ర్ట ప్రభుత్వం ఏటా విద్యుత్ బిల్లుల కోసం రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నది. సొరంగం పూర్తయితే ఈ మొత్తం ఆదా అవుతుంది. అంతేకాకుండా ఇంజినీరింగ్ రంగంలో అపూర్వమైన ఘనతతో ప్రపంచపటంలో తెలంగాణ రాష్ర్టం నిలిచిపోతుంది.