03-11-2025 01:47:13 AM
కామారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ లో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు అవినీతి రహిత వారోత్సవాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ ఆర్టీసీ డిపోలలో తూ తూ మంత్రంగా అవినీతి రహిత వారోత్సవాలను నిర్వహించారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఆర్టీసీ అధికారులు, కార్మికులు పనిచేయాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అవినీతి రహిత వారోత్సవాలను ఆర్టీసీ డిపోలలో ఆర్టీసీ అధికారులు నిర్వహిస్తారు.
ఒక్కో డిపోలో డ్రైవర్లు, కండక్టర్, స్టాప్, ఇబ్బంది కలిపి 300 నుంచి 500 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. కండక్టర్లు, డిపోలలో పనిచేసే అధికారులు, సిబ్బంది అవినీతి కి పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న అధికారులు కొందరు తమ ఇష్టానుసారంగా పెద్ద తప్పిదాలు చేసిన అధికారులకు చర్యలు తీసుకోవడం చిన్న చిన్న తప్పిదాలు చేసిన సిబ్బందిపై, డ్రైవర్లు,కండక్టర్లు పై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవడమే కాకుండా విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద తప్పిదాలు చేస్తున్న అధికారులను మాత్రం ఉన్నతాధికారులు వెనికేసుకొవస్తున్నారు.
కిందిస్థాయి పనిచేసే సిబ్బందిపై, డ్రైవర్లు, కండక్టర్లు, పై మాత్రం చిన్న తప్పిదాలకు పెద్ద శిక్షలు విధిస్తున్నారు. దీంతో తమపై ఎందుకు వివక్ష ఉన్నతాధికారులు చూపుతున్నారు తమకు అర్థం కావడం లేదని కింది స్థాయి సిబ్బంది డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. ఉన్నతాధికారులు తప్పిదాలు చేస్తే ఫిర్యాదులు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. చిన్న తప్పిదాలు చేసిన డ్రైవర్ కండక్టర్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కామారెడ్డి డిపో మేనేజర్ పై కామారెడ్డి జేఏసీ నాయకు లు ఆర్టీసీ ఉన్నతాధికారులకు, విజిలెన్స్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవలసిన ఉన్నత అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు.
అదే డిపోలో కిందిస్థాయిలో పనిచేసిన డ్రైవర్లు, కండక్టర్లు చిన్న తప్పిదాలకు విధులనుంచి తొలగించారు. ఉన్నతాధి కారులకు ఒక తీరు, కింది స్థాయిలో పనిచేసే వారికి ఒక తీరుగా ఉన్నతాధికారులు వ్యవహరించడంపై కిందిస్థాయి సిబ్బంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉన్నతాధికారులకు ఒక తీరు, కింది స్థాయి అధికారులు సిబ్బంది పై ఒక తీరు వ్యవహరించకుండా తప్పు చేసిన వారిని అందరిని ఒకే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అవినీతి రహిత వారోత్సవాలు తూతూ మంత్రంగా నిర్వహించడంపై ఆర్టీసీ పెదవి విరుస్తున్నారు. ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరికి అవినీతి రహిత వారోత్సవాల్లో సిబ్బంది కి అధికారులకు అవినీతికి పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎవరిని సంప్రదించాలి అనే విషయాలు అవగాహన సద స్సులో కార్మికులకు, సిబ్బందికి, విజిలెన్స్ అధికారులు వివరించాల్సి ఉంటుందని పలువురు కార్మికులు తెలిపారు. ఈ విషయంపై కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ కుమార్ వివరణ కోరగా అవినీతి రహిత వారోత్సవాలను నిర్వహించినట్లు విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు.