calender_icon.png 3 November, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేజీలు మూత!

03-11-2025 01:57:24 AM

దిగిరాని సర్కార్.. నేటి నుంచి బంద్‌లోకి..

రాష్ట్రవ్యాప్తంగా 2500 ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు తాళం

ప్రకటించిన ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండిం గ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీ ఫార్మసీ, బీఎడ్‌తోపాటు డిగ్రీ, పీజీ ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ పాటించనున్నాయి. పెం డిగ్ ఫీజు బకాయిలు విడుదల చేయకుం టే కాలేజీలను నిరవధికంగా బంద్ పాటిస్తామని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) ఆదివారం వరకు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. అయితే రూ.900 కోట్లు బకాయిలు విడుదలపై ప్రభుత్వం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ కు వెళ్తున్నట్లు ప్రకటించాయి.

రూ.900 కోట్లు పెండింగ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని, మిగిలిన బకాయిలు రూ.10 వేల కోట్లలో ఇప్పుడు రూ.5 వేల కోట్లు, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు మరో రూ.5 వేల కోట్లను విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని వర్సిటీ వీసీలను కాలేజీల యాజమాన్యాలు కోరాయి.

దీంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 2500 ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొనున్నాయి. ఈనెల 6న 1.50 లక్షల మంది కళాశాలల సిబ్బందితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ఈనెల 10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తామని సమాఖ్య నేతలు ఇప్పటికే ప్రకటించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను సైతం ముట్టడించనున్నారు.  

జూనియర్ కాలేజీల్లో తనిఖీలు

15వరకు చేపట్టనున్న ఇంటర్ బోర్డు

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈనెల 15 వరకు ప్రత్యేక అధికారులు, డిప్యూటీ సెక్రటరీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు ఈ తనిఖీలు చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ తనిఖీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.

అధికారులు తనిఖీల సమయం లో ఇంటర్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు పనిచేస్తున్నాయా? సిబ్బంది వివరాలు సరిగా ఉన్నాయా, విద్యార్థుల హాజరు, సంబంధిత రికార్డు లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ తనిఖీలకు సంబంధించి ఓ సమగ్రమైన నివేదికను అందించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ప్రైవేట్ కాలేజీలపైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.