calender_icon.png 20 October, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదవులకు సముచిత స్థానం

20-10-2025 12:12:10 AM

వారి సంక్షేమానికి కృషి 

సదర్‌ను రాష్ర్ట పండుగగా గుర్తించాం

  1. మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పిస్తాం
  2. శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): యాదవులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. హైదరాబాద్ అభివృద్ధిలో, శాంతిభద్రతల పరిరక్షణలో యాదవుల పాత్ర కీలకమని కొనియాడారు. అదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

యాదవుల ఆత్మగౌరవ ప్రతీక సదర్ ఉత్సవాన్ని రాష్ర్ట పండుగగా గుర్తించామని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వేడుక ప్రాంగణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళాకారులు డప్పు చప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. అనంతరం హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, యాదవరాజులు పరిపాలించిన కాలం నుంచే హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు నిర్వహించడం మన ఘనమైన చరిత్రకు నిదర్శనం. ఎంత కష్టం వచ్చినా నమ్మినవారికి అండగా నిలబడటం యాదవుల నైజం. వారి సహకారం వల్లే హైదరాబాద్ నగరం శాంతియుతంగా ఉంటూ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సదర్‌ను రాష్ర్ట ఉత్సవంగా ప్రకటించాలని యాదవులు కోరగానే తక్షణమే ఆమోదం తెలిపామన్నారు. రానున్న రోజుల్లో యాదవులకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పిస్తామని ఈ వేదికగా హామీ ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.