calender_icon.png 13 August, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాన రానుంది !

04-08-2025 12:00:00 AM

ఒక పల్లెటూళ్ళో ఓ భూకామందుండేవాడు. అతని దగ్గర ఓ పాలేరు. కామందు కొడుకు బాబు, పాలేరు కొడుకు సుబ్బయ్య. బాబు, సుబ్బయ్య ఒకే ఈడు వాళ్ళు కావటంతో కలిసి ఆడుకునేవారు. బాబు, సుబ్బిగాడు ఒక్క క్షణమైనా విడవకుండా ఏవేవో ఆటలాడుకుంటూ ఉండేవా రు. బాబు తినడానికేం తెచ్చుకున్నా.. సుబ్బిగాడికి కొంచెం పెట్టేవాడు. బళ్ళో నేర్చుకు న్న కథలు, పాటలు బాబు ఎంతో గొప్పగా చెబుతుంటే సుబ్బయ్య నోరు తెరుచుకు వినేవాడు.

“బాబూ, బాబూ” అంటూ సుబ్బయ్య ఎప్పుడూ బాబు చుట్టూ తిరిగేవాడు. వీళ్ళ సఖ్యత చూసి సుబ్బయ్య తండ్రి తమ బతుక్కేదో భరోసా దొరికినట్లు ఎంతో తృప్తి పడేవాడు. బాబు పైచదువులకి పట్నం వెళ్ళాడు. సుబ్బయ్య ఊళ్ళోనే ఉండిపోయేడు. బాబు పెద్ద చదువులతోపాటు పెద్ద పెద్ద వ్యవహారాల్లో జొరబడ్డా డు. అందరితోపాటు స్వరాజ్య పోరాటంలో దూకేడు. మీల్లు బట్టలు విడిచి సన్న ఖద్దరు కట్టేడు. తరువాత పట్నం చదువు వదిలి పల్లెపట్టుకు తిరిగి వచ్చేడు. తండ్రి ఆస్థికి భూములకీ యువరాజయి పెత్తనం తల కెత్తుకున్నాడు.

సుబ్బయ్య ఊళ్ళో ఉన్న చదువుక్కూడా నోచుకోలే దు. సాము గరిడీల్లో మాత్రం గడితేరేడు. చిన్నప్పట్నించీ తండ్రి వెనకే తిరిగి పనిపాట్లన్నీ నేర్చుకున్నాడు. ముసలాడయి పోతున్న తండ్రి పనిబరువంతా నెమ్మది నెమ్మదిగా తన భుజం మీదికి మార్చుకున్నాడు. తోటి వాళ్ళందరికీ మన సు కెక్కిన మనిషిగా మసలుకుని పల్లెకంతటికీ “అన్న” అయేడు. ఎవరికే కష్టం వచ్చి నా నేనున్నానని తయారయి ఆదుకునేవాడు.

బాబు ఊరికి తిరిగి రాగానే తన కేదో కొత్తబలం వచ్చినట్టు సంబరపడ్డాడు సుబ్బడు. పెద్ద దొర మంచివాడే కాని ఆయన చూపులకి పులిలా ఉంటాడు. ఎదుటపడి ఏదన్నా చెప్పాలన్నా భయమే. బాబు అలాకాదు, ఎంతో స్వతంత్రం ఉన్న మనిషిలా మసలుతాడు. “నేనూ మీలాంటి మనిషినే కదరా! పులినో, సింహాన్నో చూసినట్టలా జడుస్తారెందుకుంటూ మనుషుల్ని మచ్చిక చేస్తున్న ట్టుంటాడు. కదిపితే చాలు ఏవేవో చాలా కబుర్లు చెబుతాడు.

అతను చెప్పేవన్నీ ఎవరికీ అర్థం కాకపోయినా రోజులు మారిపోయేయనీ, స్వరాజ్యం వచ్చేసిందనీ, అందరూ మనుషులే - అంద రూ సమానమేనని బాబు చెబుతున్నాడని మాత్రం అంతా అనుకునేవారు. సుబ్బయ్య తండ్రితరం వాళ్ళంతా బాబు బుద్ధులు చూసి దేవుడని మెచ్చుకున్నారు. తరతరాలుగా తాము పడుతున్న కష్టాలు ఇక తీరిపోయాయని కళ్ళు తుడుచుకున్నారు.

బాబు దేశభక్తీ, త్యాగమూ ఆ చుట్టుపట్లంతా పాకి ఈ ప్రాంతానికంతా బాబే పెద్ద అయేడు. బాబుని అందరూ పొగుడుతుంటే సుబ్బయ్య తనే యేదో సాధించినట్టే సంబరపడిపోయేడు. చిన్ననా టి స్నేహాన్ని గుర్తు చేస్తూ బాబుతో కల్పించుకు చనువుగా తిరిగేడు. బాబు కూడా సుబ్బయ్యమీద వ్యవసాయభారం పూర్తిగా వదిలేసి అలనాటి స్నేహాన్ని కొనసాగించేడు.

స్నేహితులిద్దరికీ ఎవరి హోదాలో వాళ్ళ కి పెళ్ళిళ్ళయి సంసారా లేర్పడ్డాయి. బాబు పెళ్ళికి అందరితోపాటు సుబ్బయ్య తరలివెళ్ళి అక్కడకూడా తన వంతు చాకిరీ చేసి మూడ్రోజులు పప్పన్నం తిన్నాడు. సుబ్బ య్య లగ్నానికి బాబు కొత్త పంచె ఇచ్చి నిండు గా నవ్వేడు. “పెళ్ళాం మోజులో పడి పొలం మరిచేవురోయ్‌” అని హాస్యమాడేడు. తండ్రి హయాంలో కొర్ను వుండి పోయిన బంజరు కూడా వర కట్టించేడు బాబు.

తండ్రిని మించి కష్టపడి గాదులు నింపేడు సుబ్బయ్య. బాబు ఇంటిమీద పెంకులు తీసేసి డాబావేసి పైనో రెండుగదులు వేసేడు. సుబ్బయ్య పాకలో తినే నోళ్ళు ఇంకో రెండు పెరిగేయి. పొలాల్లో పంటలు పెరిగేయి. ఊళ్ళో ధరలు పెరిగేయి. పల్లెల్లో పస్తులు పెరిగేయి. వర్షాలు పడ్డాయి. ఆకులు నలుపుకు తిరిగేయి. ఊడుపులు సిద్ధం అయాయి. పల్లెలో కూలీ, నాలీ జనాలకు ఆశలు ఉరికేయి. సమయంలో ఎలాగై నా కష్టపడి మరో కార్డబ్బు సంపాయించాలని పల్లెజనమంతా కూడబలుక్కున్నారు. నాట్లకి రేట్లు పెంచితేగాని పను లు సాగవన్నారు. ఊరి కామందులందరికీ మొనగాడు బాబు గారే.

అటూ ఇటూ కూడా అందరికీ తల్లో నాలికిలా ఉంటాడు. అతనొకడే పల్లెజనం గోడు పట్టించుకునే మనిషి, ఆ బాబు తల్చుకుంటే వ్యవహారమంతా సవ్యంగా తేలిపోతుందన్నారు. అందుకు తగ్గవాడు సుబ్బడే అన్నారు అందరూ, ఒకే మాటగా. ఊహ తెలిసిన దగ్గర్నించి నోరు మెదపకుం డా బండగా మొండిగా పని చేసుకుపోవడమేగాని, అది కావాలి ఇది కావాలని ఏనాడు నోరు తెరిచి అడిగే అలవాటు లేని సుబ్బయ్యకి అంతా కొత్త అనిపించింది.

మనల్ని కనిపెట్టి ఉండే మారాజులు. ఆళ్ళకి మన కష్టసుఖాలు తెలీవా? కష్టం కనిపెట్టి ఆరే కూల్లు పెచ్చేయించుతార్లే అనుకున్నాడు ముందు. అడగందీ అమ్మయినా పెట్టదులే అని మనసు ఫిరాయించుకున్నాడు మళ్ళీ. పెరుగుతున్న సంసారాలూ, బరువయిపోతున్న పనులూ, చితికిపోతున్న వాడకట్టు వాళ్ళ బతుకులూ, పందె పు గిత్తల్లా అందకుండా పరిగెత్తుతున్న ధరలూ, అన్నీ నెమరేసుకున్నాడు.

కళ్ళలో ఒక క్షణం పాలుమాలి అలా ఉండిపోయే డు. తన కళ్ళముందే ఊళ్ళో పాతికేళ్ళయీ ఎవరెవరు ఎలా ఎత్తిరిల్లారో, ఎవరెవరు ఎలా దిగజారిపోయేరో సినిమాలో చూసినట్టు వరసగా జ్ఞాపకం చేసుకున్నాడు. కష్టపడేవాళ్ళు కడతేరిపోతున్నారు. కామందులు కమ్మగా ఉంటున్నా రు. ఎద్దు పుండు కాకికి నొప్పా? ఎవడి గోడువాడు చెప్పుకోవాల. ఎవడి బతుకు వాడే బాగుచేసు కోవాల వెన్నుపూసలోంచీ ఒక్కసారి జలజలలాడి నట్టయింది. ఎదురెండ కొట్టి కళ్ళు మెరిసినట్టయింది. వెంట్రుకలు నిక్క బొడుస్తుంటే ఒళ్ళు విరుచుకుని లేచి పై పంచ దులుపుకుని బయల్దేరేడు.

“బాబూ ఆకులు ముదిరిపోతున్నాయ్. ఈ వారమే ఊడుపు లారంభించాల. ఊరంతా మన దిక్కే చూస్తున్నారు” అన్నా డు ఎలా చెప్పాలా అని తడబడుతూ. “అలాగే కానీ, రాత్రికి పంతుల్ని మంచిరోజడిగి మీ పేట జట్టుకు చెప్పు. రేపు నేను పట్నం పోతున్నాను. తిరిగొచ్చి డబ్బులు సర్దుతాను.. అయినా కొత్తగా ఇవాళ నన్నడగొ చ్చావేంది?” అన్నాడు బాబు చదువుతున్న పత్రికలోంచి తల తియ్యకుండా. “అది కాదు బాబూ, ఈసారి పేటవాళ్ళు నాట్లుకూలి పెంచమంటున్నారు. మనవెలా పెడి తే ఊరంతా అదే లెక్కగట్. రోజులు మరీ కరవయిపోనాయి.

మనవూ చూడాలి కద. ఏదో ఏర్పాటు చేసి చెబితేగాని జనం ఈ సారి పన్లకి దిగరు” నసుగుతూ, నసుగు తూ అమ్మయ్య, మొత్తానికి చెప్పేసేను. బాబు క్షణం సేపు మాటాడలేదు. పేపరు పక్కకి నెట్టి ఓ క్షణం, ఇదెవరీ మనిషీ మన సుబ్బడేనా, అన్నట్టు కన్నార్పకుండా చూసే డు. మొహంమీద కోపం ఎండ పాకినట్టు జరజర పాకింది. తమాయించుకున్నాడు. “అది సరేరా బతుకు లెవళ్లకి బాగున్నాయంటావు అందరం ఒకలాగే అడుగంటి పోతున్నాం.

నువ్వే చూస్తున్నావు కద. ఎంత చెట్టు కంతగాలి. పోనీ మనమంటే ఎలాగో తంటాలు పడి ఓ కాణో, పరకో పెచ్చువేస్తా మనుకో, మరి మిగతా రైతులంతా ఆ ప్రాప్తిని కక్కాల్సిందే కదా. అయినా ఇది చిత్రంగా ఉందిగాని, పేటవాళ్ళ కీయేడు ఏం పుట్టిందంట? పని సాగించి ఆ వెనక, బాబూ కష్టం చూచి కాన్డబ్బు పెంచండంటే అదో తరహా. అదీ లేదు. ఈ బెదిరింపు బేరా లేమిటి ఈ రాయబారాలేమిటి?

అయినా ఇవాళా రేపూ మంచికి రోజులు కావురా” అని సన్నాయి నొక్కులు నొక్కా డు. వాళ్ళకి మతి లేపోతే పోయిరి. నీ బుద్ధేవయిందన్నాడు. తిన్నింటి వాసాలు లెక్కేసే గుణం కాదా నీది అని నిలదీసేడు. ఇలాం టి వేషాలు మొక్కలోనేతుంచాలన్నాడు. చివరికి పేటవాళ్ళు రానంటే పొరుగూరి వాళ్ళని పిలిపించి నాట్లేయించమన్నాడు. ససేమిరా పైసా పెంచటానికి వీల్లేదన్నాడు.

సుబ్బయ్య నిర్ఘాంతపోయేడు. పసిరికలో పాముని చూసినట్లు బెదిరి బేజారై పోయాడు. పల్లెజనానికి దేవుడనుకున్నానే, అంతప్పణ్ణుంచి నేస్తుడను కున్నానే -యీ బాబేవిఁటి ఇలా దులిపేత్తున్నాడు నన్నూ - నా పల్లె వాళ్ళనీ, అనుకున్నాడు. ఈ కవత్రవంతా నా చేతులమీదే నడుత్త దనుకు న్నానే, అంతా వుత్తిదేనా అని నివ్వెరపోయే డు. అటు నకనక లాడుతున్న వాడజనమూ - ఇటు నవనవలాడుతున్న బాబు - తనెక్కడ?

మొదటిసారి నీట్లో దిగిన వాడికి క్షణం ఊపిరాడనట్టు గాభరా పడ్డాడు. చివరికి మెల్లగా “ఈ జనం కడుపు కొట్టటానికి పొరుగూరి జనం మాత్రం వస్తారా బాబూ, ఆ యవ్వారమేందో మీరే సూదండి” అని గొణిగి అక్కడ్నించి కదిలిపోయేడు. ఒళ్ళు కొవ్వొక్కి పల్లెవాళ్ళు సమ్మెకి దిగేరని బాబు చిందులు తొక్కేడు. నా ఉప్పుతిని వాళ్ళకి వత్తాసిస్తాడా వీడని సుబ్బయ్య మీద పళ్ళు కొరికేడు.

పేనుకు పెత్తనమిస్తే ఇంతేనని విసుక్కున్నాడు. కుక్కబుద్ధి ఎక్కడికి పోతుందని ఛీత్కరించేడు. వీడో నాయకుడా -అసలీ వెధవకి తగిన బుద్ధి జెప్తే తక్కిన వాళ్ళ రోగం కుదిరి దారి కొస్తారని తీర్మానించుకున్నాడు. మూడో నాటికల్లా సుబ్బయ్యతో సహా కూలి పెదమేస్త్రీ రామయ్య కూడా పట్నం పోలీస్టేషన్లో ఉన్నాడు. పల్లెలో మరో పదిహేను మంది మీద బైండోవరు కేసు. బాబు పన్లోకి వెళ్ళేవాళ్ళని బెదిరించేరనీ బాబు పొలం ధ్వంసం చేస్తామని బెది రించేరనీ అధికార్లు అన్నారు.

పొరుగూళ్ళో వార్త పాకింది. ప్రారంభమైన నాట్లు ఆగిపోయాయి. బాబు సావడిలో రైతుల మంత నాలు సాగేయి. తలా ఒకటి అన్నారు. అందరూ మాత్రం పల్లెజనాన్ని తంతే తప్ప వాళ్ళు దారికి రారన్నారు. తొందరపడొద్దన్న వాళ్ళని “మీ మంచే వాళ్ళకి కొమ్ములి చ్చిందన్నారు. పల్లెలో పిల్లలు పస్తులున్నారు. ఆడవాళ్ళు అందరికీ శాపాలు పెడుతూ ఆకాశం వైపు చేతులాడిస్తూ తిడుతూన్నారు.

ఏదేమైనా పస్తులుండి చచ్చినా చద్దాంగాని కూల్లు బెంచకుండా పనుల్లో కెల్లొద్దంటున్నారంతా. వయసు మళ్ళిన పెద్దాళ్ళు మాత్రం “ఏదేమైనా మంచి మీన సాగించుకోవాల. తెల్లార్లేస్తే ఒక తాన ఉండేవాళ్ళం. తగువు పెట్టుకుంటే ఎలా తెల్లార ద్ది? అందునా వున్నాళ్ళతో పగలు కూడెట్టవం”టున్నారు. వయసు మీదున్న కుర్రా ళ్ళు “ఆ అదిగో, ఆడి సావాసం జెయిలు సూపెట్టింది మనోడికి మీ డొంక తిరుగు ళ్ళు కట్టిపెట్టండి గాని, దెబ్బకి దెబ్బ తియ్యప్పోతే అక్రమానంగా ముందు మనవే దొంగ దెబ్బకి దొరికి పోతావు ఇక సాలించండి మీ యేదాంతాలు” అని అందర్నీ గదమాయిస్తున్నారు. ఊరంతా ఈగలేగినట్టు రొదగా ఉంది. ఆ పల్లె పట్టంతా కురవబోయే ముందు ఆకాశంలా గమ్మున ఉంది.



‘అరుణతార’ కథల సంకలనం 

(1974) నుంచి..