06-08-2024 12:00:00 AM
నేడు ప్రొ.జయశంకర్ జయంతి :
డా.నామోజు :
‘మా వనరులు మాకు ఉన్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశనుండి శాసనదశకు తెలంగాణ రావాలి. మా తెలంగాణ మాకు కావాలి’ అంటూ నినదించిన యోధుడు ప్రొఫెసర్ జయశంకర్. ‘జయశంకర్ సార్’గా సుప్రసిద్ధులైన ఆచార్య కొత్తపల్లి వారు ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర.్త తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్తగా ఆయన చేసిన అలుపెరుగని పోరాటం వల్లనే తెలంగాణ స్వప్నం సాకారం అయిందన్న విషయం ఎన్నటికీ మరిచిపోలేని సత్యం.
జయశంకర్ సార్ 1952 నుండే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని భుజాలమీదకు ఎత్తుకున్నారు. నదీ జలాల పంపిణీలో తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని ఆనాడే గుర్తించి అదే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూల కారణమని చెప్పారు. ఒకవైపు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూనే మరోవైపు విద్యావేత్తగానూ రాణించారు.
కాక తీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌తోపాటు వివిధ హోదాల్లో విద్యారంగానికి సేవలు అందించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం’గా పేరు పెట్టారు.
జయశంకర్ వరంగల్‌లోని ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 ఆగస్టు 6న జన్మించారు. హనుమకొండ (వరంగల్)లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాల యాలలో ఆర్థికశాస్త్రంలో ఎంఏ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీతోపాటు బిఎడ్ కూడా చేశారు.
ఆరో తరగతిలోనే ధిక్కార స్వరం
హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉన్నప్పుడు నాటి పాఠశాలల్లో నిజాంను కీర్తిస్తూ ప్రార్థ్ధనాపూర్వక పాట పాడడం తప్పనిసరి. హనుమకొండలోని మర్కాజి హైస్కూల్లో నిబంధనల ప్రకారం విద్యార్థులు నిజాంను కీర్తిస్తూ ప్రార్థన గీతం పాడాలి. అక్కడ ఆరో తరగతి విద్యా ర్థి అయిన జయశంకర్ ధిక్కరించి ఆ పాట పాడకుండా ‘వందేమాతరం’ గీతాన్ని పాడారు.
1952లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు నిరసనగా ఇంటర్మీడియట్ విద్యా ర్థిగా ఉన్న జయశంకర్ తరగతి గది నుండి బయటికి వెళ్లిపోయారు. అదే సంవత్సరం ‘నాన్ ముల్కీ గో బ్యాక్’,‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ ఉద్యమంలో పాల్గొన్నారు. 1952 నుండి తెలంగాణ రాష్ట్ర హోదాకోసం తొలిదశ, మలిదశ ఉద్యమాన్ని కొన్నిసార్లు ప్రత్యక్షంగా, మరికొన్నిసార్లు పరోక్షంగా నడిపారు. తెలంగాణ భూములను జనావాసం చేయాలని కోరుకున్నారు.
1962లో ఆయన ఈ ప్రాంతాన్ని కదిలించిన తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. లెక్చరర్‌గా 1968లో పునరుజ్జీవన ఆందోళనలో పాల్గొన్నారు. ఆయన తెలంగాణ కోసం తన పోరాటాన్ని పరిశోధనలు, విద్య, అధ్యయనాల ద్వారా ప్రజ ల్లో అవగాహన కల్పిస్తూ అసలైన తెలంగాణ సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందారు. 1962 నుండి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1969 ఆందోళన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందించారు.
‘తెలంగాణ జనసభ’ ఆవిర్భావం
1969లో తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో మేధావులుగా దోహదపడేందుకు ప్రొ॥ రావాడ సత్యనారాయణతో సంప్రదించి దాదాపు పది మంది సభ్యులతో ఒక బలమైన బృందా న్ని జయశంకర్ ఏర్పాటు చేశారు. వీరిలో ప్రొ॥ ఆనంద్‌రావు తదితరులు ఉన్నారు. జయశంకర్ తెలంగాణ జనసభను ప్రారంభించారు. దీన్ని భారత ప్రభుత్వం నిషేధిం చింది.
తెలంగాణ సమస్యకు సంబంధించి వివిధ అంశాలపై ఆంగ్ల, తెలుగు భాషల్లో అనేక వ్యాసాలు, పరిశోధన పత్రాలు రచించారు. ప్రొ॥ జయశంకర్ 1991లో కాకతీ య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా నియమితులయ్యే ముందు అప్పటి సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్‌కు రిజిస్ట్ట్రార్‌గా పనిచేశారు. ఆయన ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు.
డాక్టోరల్ స్థాయిలో పరిశోధనలను పర్యవేక్షించారు. ఏపీకి ప్రత్యేక సూచనలతో అభివృద్ధి స్థాయిలో ప్రాంతీయ అసమానతలవల్ల తలెత్తే సమస్యలపై లోతైన అధ్య యనం చేశారు. విద్య, ఆర్థిక శాస్త్రాలలో పెద్దసంఖ్యలో పరిశోధనా పత్రాలను ఆయన రూపొందించారు.
జవహర్‌లాల్ నెహ్రూ, మన్మోహన్ సింగ్ , పీవీ నరసింహారావు, కష్ణకాంత్, శంకర్ దయాళ్ శర్మ, రంగరాజన్ వంటి ప్రముఖులతో అనుబంధాన్ని కొనసాగించారు. ఆలోచనలను పంచుకున్నారు. కొన్ని లక్షలమందిని ప్రభావితం చేసిన జయశంకర్ సార్ పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావును తనకు స్ఫూర్తిప్రదాతగా, గురువుగా భావించేవారు.
‘ఒక విధంగా ఉద్యమాల్లో ఆయ నే నాకు గురువు. విద్యార్థి జీవితం నుంచి ఆయనను ఉద్యమాల్లో చూసిన. పెద్దయినంక తెలంగాణ ఉద్యమం దాక ఆయన తోని కలిసి పని చేసిన. నిజాం వ్యతిరేక ఉద్యమం నుంచి ఆయన చనిపోయే వరకు ఏ ఉద్యమాలలో అయినా ఒక కార్యకర్తగా ఆయనతోనే పాల్గొన్న.
ఆ విధంగా ఉద్యమ స్ఫూర్తి నాలో నాటింది కాళోజీ గారే’ అనేవారు జయశంకర్. 1999లో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఏర్పాటులో జయశంకర్ కీలక పాత్ర పోషించారు. 2000 జూలైలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ అసమానతల గురించి మాట్లాడేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆయనను ఆహ్వానించింది. వీరి కోరిక మేరకు రెండు నెలల పాటు అమెరికాలోని 10 ప్రధాన నగరాలలో తెలంగాణ ఉద్యమంలోని వివిధ కోణాలపై వరుస ప్రసంగాలు ఇచ్చి ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాలపై చైతన్యాన్ని మరింత పెంచారు.
ఆయన మరణించే సమయంలో తెలంగాణ సమస్యలపై పరిశోధనలు, ప్రచురణ లు చేస్తూ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఆయన తెలంగాణ ఐక్యవేదిక వ్యవస్థాపక సభ్యుడుగా ఉండటంతోపాటు ఆ సంస్థ కార్యవర్గ కమిటీలో ఉన్నారు.
2009 డిసెంబర్‌లో తెలంగాణ కోసం చంద్రశేఖరరావు చేసిన నిరాహార దీక్షను విరమించినప్పుడు ఆయనకు నిమ్మరసం అందించిన అవకాశం జయశంకర్‌కే దక్కింది. జయశంకర్ జీవితంపై కొంపెల్లి వెంకట్ గౌడ్ ‘వొడవని ముచ్చట’ శీర్షికన గ్రంథాన్ని వెలువరించారు. జయశంకర్ సార్ పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. క్యాన్సర్‌తో పోరాడుతూ 2011 జూన్ 21 న తనువు చాలించారు.
వరించి వచ్చిన పదవులు
1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా, 1982 నుంచి 1991 వరకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్ట్రార్‌గా, 1979 నుంచి 1981 వరకు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా, 1975 నుంచి 1979 వరకు వరంగల్ సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సలహాబోర్డుల సభ్యుడుగా ప్రొ॥ జయశంకర్ సేవలు అందించారు.
ఇవే కాకుండా అనేక సంస్థాగత పదవులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పభుత్వ కళాశాల, ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయుల సంఘం నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడుగా పని చేశారు. 2000 మేలో తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్ స్థాపించారు. ఇలా ఎన్నో సంస్థల ద్వారా తన సేవలను విస్తృత పరిచారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను ఏ విధంగా చూసినా తెలంగాణకు చెందిన ఒక ప్రసిద్ధ విద్యావేత్తగా, ఉద్యమకారుడుగా, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా కనిపిస్తారు. ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణలో అనేక ఉన్నత పదవులను చేపట్టడం గమనిస్తే ఎందరికో స్ఫూర్తి దాయకంగానూ నిలుస్తారు.
వ్యాసకర్త కార్యదర్శి,
తెలంగాణ సాహిత్య అకాడమీ