calender_icon.png 10 August, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ లో ఆదివాసి మ్యూజియం ఏర్పాటు చేయాలి

09-08-2025 09:56:00 PM

నిర్మల్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహణ..

నిర్మల్ (విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్(Nirmal) పట్టణంలో ఆదివాసీ జేఏసీ(JAC) ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీల హక్కులను కాపాడాలని, వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. టీఎన్జీవో భవనం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం మీదుగా కొమురం భీమ్, రాంజీ గోండు విగ్రహాల వరకు సాగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు విగ్రహాలకు పాలాభిషేకం చేసి జెండాలను ఆవిష్కరించారు. అనంతరం టీఎన్జీవో భవనంలో జరిగిన సభలో నాయకులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మంద మల్లేష్, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట గారి భూమయ్య మాట్లాడుతూ, ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్ ను ప్రారంభించాలని కోరారు. నిర్మల్ జిల్లాలో 80 వేలకు పైగా ఆదివాసులు ఉన్నారని, ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన పోడు భూముల పట్టాలపై సాగు చేసుకునే విధంగా ఆదివాసీలకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, మారుమూల గూడేలకు రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శంభు, నైత భీమ్రావు, తోడుసం గోవర్ధన్, సుంచు శ్రీనివాస్, సాకి లక్ష్మణ్, సూరపు సాయన్న, నాయక పోడు సంఘం అధ్యక్షులు పోత్తిండ్లశంకర్, మాజీ అధ్యక్షులు మొసలి చిన్నయ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రవి, కార్యదర్శి సతీష్, ఎల్లయ్య, పోతురాజ్ శ్రీనివాస్, భీమేష్, బోసిండ్ల రాజేశ్వర్, సూర్య భాను.ఉద్యోగ సంఘ నాయకులు కస్తూరి భీమేష్, సొండి శివ శంకర్, పుష్పూర్ నరసయ్య, రాజుల నారాయణ, ఇతర ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.