05-11-2025 12:00:00 AM
-ఓవర్ స్పీడ్‌తో వెళ్లి బస్సును ఢీకొట్టాడు
-డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి
-ఘటనా స్థలం పరిశీలన.. క్షతగాత్రులకు పరామర్శ
చేవెళ్ల, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని డీజీపీ శివధర్ వెల్లడించారు. ఓవర్ స్పీడ్, ఓవర్ కంకర లోడ్‌తో కుడి వైపునకు వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడని, దాదాపు 40 మీటర్లు లాక్కెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపారు. మంగళవారం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, సీపీ అవినాశ్ మహంతితో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టం గా కనిపిస్తోందని, మలుపు ఉన్నా ప్రమాదం జరిగేంత లేదని చెప్పారు.
బస్సులో కుడి వైపు ఉన్నవాళ్లే ఎక్కవగా చనిపోయారని తెలిపారు. టిప్పర్ ఫిట్‌నెస్‌ను మెకానిక్ ద్వారా తనిఖీ చేయిస్తున్నామని, టిప్పర్ ఓనర్ లక్ష్మణ్‌నాయక్ కూడా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. చేవెళ్ల ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని త్వరలోనే అన్ని విషయాలు బయటప డతాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ సమస్య కోణంలో కాకుండా సమా జ బాధ్యత చూడాలని సూచించారు.
డిఫెన్స్ డ్రైవింగ్ పాటించాలి
రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారుతున్నాయని, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లు డిఫెన్స్ డ్రైవింగ్ పాటించాలని, రోడ్డు కండిషన్ అంచనా వేసి డ్రైవ్ చేయాలని కోరారు. రోడ్డు సేఫ్టీకి సంబంధించి వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నామని ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి ముందుకెళ్తామని చెప్పారు. పోలీస్, ఆర్ అండ్ బీతో పాటు అన్ని శాఖలు, సంస్థలు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సహాయక చర్యల్లో గాయపడి చికిత్స పొందుతున్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్‌ను, పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 13 మందిని పరామర్శించి, ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.