calender_icon.png 30 August, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహిత్య చోదకశక్తుల అనంగీకారాలు

05-08-2024 12:00:00 AM

జూకంటి జగన్నాథం :

తార్కికత మీద మౌఢ్యం దాడి చేస్తున్నది. శాస్త్రీయత మీద అశాస్త్రీయత పైచేయి సాధించాలని గొరిల్లాలాగా ప్రయత్నం చేస్తున్నది. వీటి పరస్పర ప్రతిఫలనాల దర్పణం ముందు మనిషి-- సాహిత్యం తలూపడంగా, తల వంచుకోవడంగా, చిత్తగించ వలెనుగా రూపాంతరం చెందుతున్నాడు.

అటు కళింగాంధ్రలో ఉనికి కోల్పోయి, ఇటు ఉత్తర తెలంగాణలో ఆర్థిక రాజకీయ సామాజిక పోరాటాలుగా ప్రజాపక్షం వహించిన వామపక్ష ఉద్యమాలు మైదాన ప్రాంతాల్లో కదల సాగినాయి. 1980 దశకంలో నాయకత్వ స్థాయిలో చీలికలు ఏర్పడి, సాహిత్యకారులు కూడా మనిషికో గ్రూపులుగా విడిపోయారు. ఇవి క్రమక్రమంగా సాహిత్యరంగంలో దళిత వాదంగా, స్త్రీవాదంగా, మైనారిటీ వాదంగా, అస్తిత్వ వాదంగా పురుడు పోసుకున్నాయి.

1991 నుంచి 96 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రిగా మన్మోహన్ సింగ్ కొనసాగినప్పుడు స్వేచ్ఛా మార్కెట్‌కు దేశంలోకి తలుపులు తెరిచారు. గాట్ ఒప్పందాలపై ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గి సంతకాలు చేశారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేటెంట్ హక్కులు అనే పదాలు విరివిగా ప్రచారంలోకి వచ్చాయి.

ఒక తెలుగుకవి మనిషి ముఖం వెనుక మరోముఖం అని కవిత్వం ఎందుకు రాశాడో ప్రస్తుతం వెనుకకు తిరిగి చూసుకుంటే ఒక అవగాహన ఏర్పడుతుంది. కానీ, ప్రపంచీకరణ బహుముఖాలుగా దేశంలోకి విస్తరించిన కొద్దీ మనిషి ముఖం వెనుక అవకాశ వాద క్రూరమృగం  అదను కోసం పొంచి ఉన్నదని మేధావులు, సాహిత్యకారుల ఎరుకలోకి వచ్చింది.

ఈ పొసగని అనంగీకార స్థితినుంచే కన్నడంలో ప్రముఖ రచయిత సిద్ధరామయ్య ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు, దిలీప్ కొణతం ఒక దళారి పశ్చాత్తాపం, కుట్రాజకీయం లాంటి గ్రంథాలు వచ్చాయి. స్వేచ్ఛా మార్కెట్ పేరిట వేయి చేతులు చాచి దేశాన్ని ఆక్రమిస్తున్నప్పుడు, ప్రపంచీకరణ మనిషి అన్ని సరిహద్దులను నిర్వీరం వేస్తున్నప్పుడు ఈ వాదాలు మెల్లమెల్లగా పాలు మిళితమై పలుచబడిపోయిన దాఖలాలు కనిపించాయి.

దేశంలోకి సూపర్‌బజార్లు, స్టాక్ మార్కెట్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తాత్కాలికంగా మనిషిని గందరగోళంలోకి నెట్టివేశాయి. దీర్ఘకాలంలో మనిషి మంత్లీ ఈక్వల్  ఇన్‌స్టాల్‌మెంట్లలోకి కుదించి విభజితమయ్యాడు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రభుత్వంపై అనేక కఠిన షరతులు విధించి అప్పులు ఇబ్బడి ముబ్బడిగా మంజూరు చేశాయి.

పెట్టుబడి ఎక్కడ కేంద్రీకృతమవుతుందో అక్కడికి మనిషి వలసలు నిరంతరంగా కొనసాగుతున్నాయనే మూలసూత్రం ఆధారంగా ఇప్పుడు శ్రమాధారిత వలసలనే కాకుండా మేధోపర వలసలూ దేశవిదేశాలకు విస్తరించి నూతనంగా ఎగువ మధ్యతరగతి ఏర్పడింది. మనిషి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నగదురహిత పేమెంట్‌దారునిగా పరివర్తన చెందుతున్నాడు. తనకు తానే ఇష్టపూర్వకంగా బార్‌కోడ్‌లో ఏదో ధరకు తెగనమ్ముకుంటుంటాడు.

ఇదే కాలంలో కుటీర పరిశ్రమ వ్యవసాయ రంగాలలో ఆత్మహత్యలు క్రతువుగా కొనసాగుతున్నాయి. పెట్టుబడి దిగుమతి ఎక్కువగా, ఎగుమతి తక్కువగా జరుగుతున్న దుష్ఫలితాల మూలంగా దేశంలో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు కోకొల్లలుగా పుట్టుకు వచ్చాయి. పేరు మోసిన మేధావులు ఎన్జీవోలుగా గుంబనంగా మరో అవతారం ఎత్తుతుంటారు.

ప్రభుత్వాలు ఉద్యమకారులను శాంతిచర్చల పేరుమీద బయటకు రప్పించి వారి ఆనుపానులను అతిసూక్ష్మస్థాయిలో కనుగొన్నాయి. ప్రజలకోసం ప్రాణాలను పణంగా పెట్టి పని చేసేవారు ముందు ఎప్పుడూ లేనంత దెబ్బ తిన్నారు. అందుకే ఉద్యమాలు మైదాన ప్రాంతాలను విడిచి లోతట్టు, మరింత వెనుకబడిన అటవీ ఆదివాసి ప్రాంతాలలోకి  పయనించాయి.

అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు సిక్స్‌లేన్స్ రోడ్లలో టోల్‌టాక్స్ చెల్లిస్తూ, ట్రాఫిక్ కూడళ్ల సిగ్నల్స్‌లో సమాజం యావత్తు చిక్కుపడి పోయిం ది. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశానికి తరతరాలకు ఉపయోగ పడవలసిన జాతి సహజ సంపదలను, వనరులను అతి తక్కువ ధరకు  ప్రభుత్వాలు ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను నయానా భయానా అణిచివేసి బహుళ జాతి కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాయి.

అలా అవి అమ్మకమవుతుంటాయి. అంతేగాక, ఇది చాలదన్నట్టు అగ్రరాజ్యాలు యుద్ధాలను ఉత్పత్తి చేయడానికి దేశాలమధ్య ఉద్రిక్తలను సృష్టించి ఆయా దేశాల మూలసం పదలోని సింహభాగాన్ని అనుత్పాదక రంగానికి వ్యయపరిచేలా భద్రత పేరుమీద కొల్లగొట్టడం జరుగుతుంటుంది. 

ఇన్ని పరస్పర దర్శన ఘర్షణల మధ్య చోదకశక్తులైన మేధావులు, కవులు, రచయితలు, పాత్రికేయులు తమ భావజాల ప్రక్రియలు, ప్రకటనల ద్వారా అసంతృప్తులను వెలుబుచ్చుతుంటారు. కొండకచో అనంగీకారాలను ప్రశ్నించేవారుగా ఉద్యమాల దిశగా ప్రజలను తీర్చిదిద్ది సిద్ధం చేస్తుంటారు.

ఈ వ్యతిరేకత ప్రజలలో ఏ స్థాయిలో ఉందో అంతకు రెట్టింపు స్థాయిలో ప్రకటనలు మాధ్యమాల ద్వారా మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అతి సున్నిత మనస్కులు, తడిగల మనుషులు తమ సాహిత్య ప్రక్రియల ద్వారా అనంగీకారాలను  తెలియజేస్తున్నారు. ప్రజల చేతుల్లో ప్రశ్నను ఆయుధాలుగా మలిచి పెడుతున్నారు. ఇది కటిక చీకట్లో చిరుదీపం వెలిగించి మిణుకు మిణుకుమనే ఆశలకు ఊపిరులూదినట్టు అవుతున్నది.

వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత

సెల్: 9441078095