05-08-2024 12:00:00 AM
గన్నమరాజు గిరిజా మనోహరబాబు :
సాధారణంగా సాహిత్య చరిత్రలో కొందరు కవులు విస్మర ణకు గురవుతుంటారు. అందులోను విశేషమైన సామాజిక అంశాన్ని వస్తువుగా స్వీకరించి ప్రత్యేకంగా ఒక కల్పిత కావ్యాన్నే సృజించిన కవిని సాహిత్య చరిత్రకారులు విస్మరించడం ఆశ్చర్యమే. దానికెన్నో కారణాలు ఉండవచ్చు. గ్రంథం లభింపక పోవడమో లేదా ఆ కవి స్థలకాలాలు లభించక పోవడమో కారణాలై ఉండవచ్చు. కానీ, నూతన కవి సూరన విషయం అది కాదు.
ఆయన కల్పిత కావ్యమైన ‘ధనాభిరామం’ లభ్యంలో ఉన్నదే. పైగా ‘సమాజంలో ప్రాధాన్యం రూపానిదా? ధనానిదా?’ అనే ప్రధానమైన ప్రశ్నను స్వీకరించి, తత్సంబంధ కథలను కల్పించి, ఒక విశేషమైన పద్యకావ్యం 15వ శతాబ్దం ప్రారంభకాలంలో రచించడం అన్నది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశమే.
16వ శతాబ్దంలో వెలువడ్డ పింగళి సూరన ‘కళాపూర్ణోదయాన్ని’ తొలి కల్పిత కావ్యంగా ఎందరో సాహిత్య చరిత్రకారులు భావిస్తున్నారు. దీనివల్లే ఈ ‘ధనాభిరామం’ కావ్యం వెలుగులోకి రాలేదేమో. నూతన కవి సూరన కావ్యం (ధనాభిరామం) పింగళి సూరన కావ్యం (కళాపూర్ణోదయం) కన్నా సుమారు 50 60 సంవత్సరాలకు పూర్వకాలానిదిగా సాహిత్యకారులు భావిస్తున్నారు. ‘ధనాభిరామం’ ఒక విశేష కావ్యం. లోకంలో ముఖ్యమైన విషయాలు ఏవి? ‘ముఖ్యమైంది రూపమా? ధనమా?’ అనే ప్రశ్నల కోసం కల్పించిన కథ ఈ కావ్యంలోని వస్తువు. దీని కోసం ఒక ప్రత్యేకమైన కథనాన్ని అల్లి కావ్య రచన చేశాడు మహా రచయిత నూతన కవి సూరన.
రూపమా? ధనమా?
దేవేంద్రుని సభలో సకల దేవతలు, మునులు అందరూ కొలువై ఉన్న ఒకానొక అరుదైన సందర్భం అది. అప్పుడు ‘మనిషికి రూపం ముఖ్యమా? ధనం ముఖ్యమా?’ అనే చర్చ మొదలవుతుంది. ముందుగా మన్మథుడు ‘రూపమే ముఖ్యం’ అంటాడు. అప్పుడే కుబేరుడు, ‘కాదు, ఎవరికైనా ధనమే అతిముఖ్యమైంది’ అని వాదిస్తాడు. ఈ చర్చ వాదోప వాదాలకు దారితీస్తుంది. చివరకు ద్రాక్షారామ భీమేశ్వరుని మధ్యవర్తిత్వం కోసం మన్మథ, కుబేరులు ఇరువురూ ద్రాక్షారామం చేరారు.
అక్కడ ఒక వేశ్య మన్మథుని రూపానికి ముగ్ధురాలవుతుంది. తాను అతనికి లొంగి ప్రవర్తిస్తూంటుంది. ఈ తరుణంలో కుబేరుడు ప్రవేశిస్తాడు. తన ధనసంపత్తితో ఆ వేశ్య కన్నతల్లిని మెప్పిస్తాడు. ఆమె కుమార్తెను తాను పొందాలన్న కోరికను వెలిబుచ్చుతాడు. కానీ, ఆ వేశ్యా స్త్రీ కుబేరుణ్ణి తిరస్కరిస్తుంది. ఆమె తల్లి ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా అంగీకరించదు. చివరకు ఆ క్షేత్ర దైవమైన ద్రాక్షారామ భీమేశ్వరుని వద్దకు చేరుతుంది వివాదం. స్వామి బోధతో కథ ముగుస్తుంది.
సార్థక నామధేయుడు
అప్పటి వరకూ పురాణాల నుండో, ఇతిహాసాల నుండో ఇతివృత్తాలను స్వీకరించి మహాకావ్యాలను రచించేవారు. ఈ తరుణంలో అత్యంత వినూత్న కథాంశంతో కల్పిత కావ్యాన్ని రచించిన సూరన కవి ఇంటిపేరు ‘నూతన కవి’ కావడం కూడా ఈ రకంగా సార్థకమైంది.
15, 16వ శతాబ్దాల కాలానికి చెందిన కవిగా గుర్తింపు పొందిన ఈ కవిని నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని ముదిగొండ వాసిగా సాహిత్య చరిత్రకారులు భావించారు. ఆరుద్ర, ఆచార్య ఎస్.వి.రామారావు, డా.గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి వంటి పలువురు సాహిత్యవేత్తలు ఈ నూతన కవి సూరన జన్మస్థలాన్ని పలు ఆధారాలతో నిర్ణయించే ప్రయత్నం చేశారు.
ముదిగొండ వాసిగానే నిర్ధారణ
‘ధనాభిరామం’ కృతి ద్రాక్షారామ భీమేశ్వరునికి అంకితమివ్వడం, ఆ స్వామియే ఈ రచనలో ఒక పాత్ర కావడాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన కవి సూరన ద్రాక్షారామ ప్రాంతం వాడేమోనని ఊహించారు. కానీ, ఆయన భైరవ కవి సమకాలీనుడు కావడం, వీరభద్రుడు (వీరభద్రాచార్యులు) వీరిరువురికి గురువు కావడం, అయన దేవరకొండ సమీపంలోని ముదిగొండకు చెందిన వ్యక్తిగా నిర్ధారణవడం, ఈ రచనలో ప్రయోగితమైన పలుకుబడులు, పదాల వాడకం.. వీటన్నిటినీ గమనిస్తే తాను ముదిగొండ నివాసియేనని స్పష్టమైంది.
8 ఆశ్వాసాలు, 328 గద్య పద్యాలు
విచిత్రమైన కథతో సాగిన రచన ‘ధనాభిరామం’. 1950లో వావిళ్ల వారు ఈ కావ్యాన్ని వావిళ్ల వెంకటేశ్వర్లు విలువైన పీఠికతో ముద్రించారు. ఇందులో వెంకటేశ్వర్లు కావ్య ప్రశస్తిని వివరిస్తూ, ‘విసుగు పుట్టించు వర్ణనల్లేక, చక్కని కథాసరళితో, సముచిత శృంగార వర్ణనలతో గూడిన యీ కృతి యింతవరకు ప్రసిద్ధి గాంచకుండుట జూచి, నేడు రెండు మూడు ప్రతులచే సరి చేయించబడిన గ్రంథము నాధారముగా గొని, దీనిని ముద్రించి ప్రకటించితిమి’ అన్నారు.
తొలిసారి దీనిని ముద్రిస్తూ వారు చెప్పిన మాటలనుబట్టి ఆనాటి కావ్యరచనలకు భిన్నంగా విస్తృత వర్ణనలను తొలగించి, గొప్ప కథను కల్పనతో రచించినట్లు తెలుస్తున్నది. అప్పటికి అందుబాటులో వున్న ప్రతులను సమన్వయించుకొని నిర్దుష్ట ప్రచురణ చేసినట్లు అర్థమవుతున్నది.
తిరిగి 2017లో అప్పటి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి పూనికతో ప్రముఖ పరిశోధకుడు డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి ‘నా మాట’తో డా.ఆలేటి మోహనరెడ్డి విస్తృత పీఠికతో పునర్ముద్రితమైంది. ఇలా, తెలుగు సాహితీ ప్రియులకు ఆ కావ్యం అందుబాటులోకి వచ్చింది. 328 గద్య పద్యాలతో 8 ఆశ్వాసాలున్న ‘ధనాభిరామం’ తొలి తెలుగు కల్పిత కథా కావ్యంగా వెలుగుచూసింది.
తిక్కన వారసత్వం, పోతన ప్రభావం
1420 ప్రాంతం వానిగా నిర్ధారితమైన నూతన కవి సూరన తన కావ్యంలోని పూర్వకవి స్తుతిలో నన్నయ, తిక్కన, నాచన సోమన, చిమ్మపూడి అమరేశ్వరుడు, భాస్కరుడు, రంగనాథుని వంటి కవులను స్తుతించాడు. ఈ కవికి తిక్కనపట్ల గొప్ప గౌరవం కనిపిస్తుంది. తనను తాను తిక్కన వంశీకుడనని చెప్పుకున్నాడు. ఈయన కాలం నాటికే శైవ వైష్ణవ మతకలహాలు తగ్గిపోయాయి.
తిక్కన హరిహరనాథ తత్త ప్రభావం సాహిత్య లోకంలో బాగా విస్తరించింది. ‘మతావేశాలు తగ్గిపోయి కావ్యతత్తం వికసిస్తున్న కాలంలో వచ్చిన వైవిధ్యభరత రచన’గా బాలశ్రీనివాసమూర్తి దీనిని భావించారు. అప్పటికే శ్రీనాథ, పోతనాదుల రచనలు సాహితీ ప్రపంచాన్ని కవిత్వశక్తితో అలరిస్తున్నాయి. వారి రచనలు సూరనను బాగా ప్రభావితం చేశాయి.
‘ధనాభిరామం’లోని అనేక పద్యాల్లో స్పష్టంగా పోతనామాత్యుని ప్రభావం దర్శనమిస్తుంది. పైగా తన సమకాలీనుడు, గురువైన వీరభద్రాచార్యుని వద్దే విద్యనార్జించిన కవి ‘రత్నపరీక్ష’, ‘శ్రీరంగ మహత్యము’ వంటి గొప్ప రచనలు చేసిన భైరవ కవి సాహచర్యం ఈ కవి కావ్యరచనకు గొప్ప స్ఫూర్తినిచ్చిన అంశాలు. ఈయన పద్యాన్ని పెదపాటి జగ్గన తన ‘ప్రబంధ రత్నాకరం’లో ఉదాహ రించడం కావ్య ప్రాశస్త్యాన్ని తెలుపుతున్నది.
భీమేశ్వరుడు చూపిన రాజీమార్గం
‘ధనమా? రూపమా? ఏది గొప్ప?’ అనే కథాంశంతో సాగిన ‘ధనాభిరామం’ కావ్యంలో
‘రూపంబు ధనము నిచ్చును
రూపంబటు తన కులంబు రూఢిగ జేయున్
రూపంబు లోక వశ్యము
రూపము లేనట్టి నరుని రోతురు భామల్’
అని ఒకవైపు రూపలావణ్యపు ఘనతను చెబుతూనే, కుబేరుని నోట ధనం ఆధిక్యతను పేర్కొన్నారు.
‘కడువికృతాంగుని చక్కని వానిగాజేయు
పాపకర్ముని పుణ్యవరుని జేయు
చంచలాత్ముని నిశ్చల చిత్తుగా జేయు
నధిక భీతుని సాహసాంకు జేయు
కులహీను మిక్కిలి కులజునిగా జేయు
వీరిడి వాని వివేకి జేయు
వడి ననా చారు నాచారవంతుని జేయు
సరవితో జడమతి సరసు జేయు
బేల నలభీము డనుపేర బిలువ జేయు
రసికతలు యింతలేని నిరక్షరీకు
పావనంబైన సకల విద్యావిశాలు
డనగ జేయును ధనము తథ్యంబు వినుము’
అని ధనం మాయను వివరించాడు.
అని ధనం మాయను వివరించాడు.
పైగా, ‘స్త్రీలకు ధనమే ముఖ్యం. రూపం కాదని’ కుబేరుడు వాదించాడు. దీంతోపాటు స్త్రీల మనస్సు తెలుసుకోవడం బ్రహ్మకుకూడా సాధ్యం కాదనిపించాడు. చివరకు మధ్యవర్తియైన ద్రాక్షారామ భీమేశ్వరుడు అప్పటికే వేశ్యమాత కారణంగా ధనమే గెల్చినా వీరిద్దరినీ ఉద్దేశించి ఒక సమన్వయ దృష్టితో
‘రూపు లేకున్న జగతిలో రూఢి లేదు
ధనము లేకున్న మరియునంతకును కొఱత
వలయు రూపంబు ధనము నవశ్యమఖిల
మానవులకును సురలకు మానకిపుడు’
అంటూ ఒక రాజీమార్గాన్ని సూచించిన విషయాన్ని వీళ్ల వాదోపవాదాలను దక్షవాటిలోని వేశ్య, వేశ్యమాత ఘట్టాన్ని కావ్యంలో చివరిదైన 3వ ఆశ్వాసంలో కవి 111 పద్యాల్లో నిబద్ధించి కథకు ముగింపు పలికాడు.
అద్భుత రచనా శిల్ప విన్యాసాలు
ఈ కావ్యంలో నూతన కవి సూరన ద్రాక్షారామంలోని విశేషాలను 14 పద్యాల్లో వర్ణించాడు. సానివాడల వర్ణన సందర్భంలో ఆయనలో శ్రీనాథుని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ధ్వన్యాత్మక రీతిలో ‘ధనమే ముఖ్యమన్న’ భావన కనిపించే పద్యాలు కూడా ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి.
‘చుట్టములు గానివారలు
చుట్టాలము మీకుననుచు సొంపు దలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు,
గట్టిగ ద్రవ్యంబు చాల గలిగిన బంధుల్’
అన్న పద్యం లోకంలో బంధుజనం తీరును తెలుపుతున్నది. ఈ కావ్యంలో పద్య నిర్మాణంలో గొప్ప సమత్వం కనిపిస్తుంది. సూరన కవి పద్యాన్ని ఎంత రమ్యంగా రచింపగలడో వచనంలోను అంతటి ప్రతిభనే కనబరిచాడు. ఆయన వచన రచనా విన్యాసం గొప్పగా దర్శనమిస్తుంది. శృంగారం వంటి రసాల నిర్వహణలోనూ నూతన కవి సూరన తనదైన వర్ణనా చాతుర్యాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే గొప్ప సంయమనం పాటించాడు.
ఫలితంగా, మిక్కిలి ఔచిత్యంతో అద్భుత రచనా శిల్ప విన్యాసం కొనసాగడం ఆయనలోని సృజనాత్మక ప్రజ్ఞకు నిదర్శనం.తనకు ఇష్టదై వమైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని ఈ కావ్యంలో ఒక పాత్రను చేయడం చెప్పుకోదగ్గ విశేషం. నూతన కవి సూరన తన తరువాతి వాడైన పింగళి సూరనకు కల్పిత కావ్య నిర్మాణంలో మార్గదర్శి అయ్యారు.
వ్యాసకర్త సెల్: 9949013448