calender_icon.png 30 August, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకు మడి

05-08-2024 12:00:00 AM

కొన్నిసార్లు ఇంతే 

ఇంకోచోటకి వెళ్లిపోవాల్సిందే 

పక్షులకైతే రెక్కలుంటాయి 

మనుషులకు జ్ఞాపకాలు 

మిగులుతాయి 

బడి పిల్లలు మనం కోల్పోయిన 

బాల్యాన్ని దోసిట్లో పోస్తారు 

లోకంలోని వెలితి 

నల్లబోర్డ్ సాక్షిగా నాలుగు

గోడల మధ్య 

పిల్లల నవ్వుతో తీరిపోతుంది 

స్టాఫ్ రూమ్‌లోకి 

అడుగుపెడితే చాలు 

మనసుకు పట్టిన మకిలిని 

ఇష్టమైన ముచ్చట్లతో 

కడిగేసుకోవచ్చు 

కాలం చాక్ పీస్ కరిగినంత 

తొందరగా 

ముందుకు పోదు 

పాఠాల్లోని పద్యాల 

పరిమళంతో ఆవరణ

పరవశించిపోతుంటే

క్యాలెండర్లోంచి సెలవుల 

పిట్టలు ఎగరాలని చూస్తుంటాయి 

అలకలుంటాయి ఆనందాల 

అమరికలూ వుంటాయి 

ఒకరోజు వెచ్చటి 

సూర్యరశ్మితో తరగతి 

వెలిగిపోతే 

మరోరోజు వృక్షాల నీడలు, 

జంతువుల పరేడ్లు 

ఇంకోపూట రాజుల రథాలు, సింధూ నాగరికత లోయలో సామాన్యుని వెతలు 

అన్ని విషయాల గుల్దాస్తా 

మా బడి 

బడంటే బతుకును 

పచ్చటి వరి మడిలా 

మార్చేటి మంత్రదండం.

 వేముగంటి మురళి 

9676598465