05-03-2025 01:41:48 AM
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సేకరించేందుకు గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విశాలమైన భూమికి మాస్టర్ లేఅవుట్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కి అప్పగించింది.
ప్లాట్‌లను డిజైన్ చేసి వేలం వేయడానికి కన్సల్టెంట్ల ఎంపిక కోసం టీజీఐఐసీ బిడ్‌లను ఆహ్వానించింది. డిసెంబర్ 2023లో అధికారం చేపట్టి న తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న మొదటి ప్రధాన భూవేలం ఇదే. ఈ వేలం ద్వారా ప్రభుత్వం రూ.20,000 కోట్లకు పైగా సేకరించాలని ఆశిస్తోంది.
ఈ భూమి వేలానికి సంబంధించి గత నెల 28న టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 15 ఆఖరి తేదీగా నిర్ణయించారు.
గచ్చిబౌలి స్టేడియాన్ని ఆనుకుని ఉన్న అతి ఖరీదైన భూమి..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పీ) వద్ద ఉన్న 400 ఎకరాల స్థలం కోసం ప్రపంచస్థాయి మాస్టర్‌ప్లాన్ లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలని టీజీఐఐసీ ఆలోచిస్తోంది. ఎంతో ఖరీదైన ఈ స్థలం గచ్చిబౌలి స్టేడియాన్ని ఆనుకుని, హెచ్‌సీ యూ పరిధిలో ఉంది.
ఈ భూమిని దశలవారీగా అభివృద్ధి చేసి వేలం వేస్తారు. ప్రభు త్వ ఖజానాకు భారీగా నిధులు పోగయ్యేందుకు కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకు ని ఈ వేలం ఉండనుంది. ఎంతో డిమాండ్ ఉన్న ఈ భూమి నగరానికి పశ్చిమాన వేగం గా అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతానికి దగ్గర్లో ఉంది.
హైటెక్ సిటీ నుంచి 8 కి.మీ, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ నుంచి 17 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 22 కి.మీ, శంషాబాద్ విమానాశ్రయం నుంచి దాదా పు 33 కి.మీ దూరంలో ఉందని బిడ్ డాక్యుమెంట్ పేర్కొంది. సైబరాబాద్ పరిధిలోని ఈ ప్రాంతంలో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలకమైన వాణిజ్య ప్రాంతాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తాయని సర్కా రు భావిస్తోంది.
హైదరాబాద్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ)గా సమిష్టిగా గుర్తించబడి న ఈ ప్రాంతం 100 కంటే ఎక్కువ పెద్ద ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ గ్లోబల్ కంపెనీలకు నిలయంగా ఉంది. ఇక్కడ 10 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.
గతేడాది కేసు గెలిచిన సర్కారు..
400 ఎకరాల ఈ భూమిని 2006లో అప్పటి కాంగ్రెస్ సర్కారు ఐఎంజీ అకడమి క్స్, భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. అయితే అదే ఏడాది సర్కారు ఈ కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐఎంజీ అకడమిక్స్, భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టుకు వెళ్లాయి. అదే ఏడాది నవంబర్ 29న కోర్టు స్టే ఇచ్చింది.
తుది తీర్పు వెలువడే వరకు భూమి ప్రభుత్వ అధీనంలో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. 2006 నుంచి 2024 వరకు సుదీర్ఘ కాలం కోర్టులో కేసు నడిచింది. గతేడాదే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ సర్కారుకు సరిగ్గా సరైన సమయంలో ఈ భూమి ఆర్థిక వనరుగా మారింది.