13-05-2025 05:37:02 PM
మందమర్రి (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) పట్టణ అధ్యక్షులుగా సప్పిడి నరేష్ ను నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ దాని అనుబంధ సంఘాల్లో క్రియా శీలకంగా పనిచేస్తు పార్టీ అభివృద్ధికి విశేష కృషిచేశారు. ఆయన సేవలను గుర్తించి పార్టీ పట్టణ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు అధ్యక్షుడిగా సప్పిడి నరేష్ ను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు డివి దీక్షితులు, సంజీవరావు, రోడ్డ మోహన్ లు మాట్లాడారు.
పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ భారత సైన్యం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టి పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి దీటుగా సమాధానం చెప్పిందన్నారు. దేశాన్ని కాపాడే సత్తా బీజేపీకే ఉందని వారు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) నాయకత్వంలో ప్రపంచంలో దేశం ఐదవ ఆర్థిక శక్తిగా రూపొందిందన్నారు. దేశ ప్రజలకు రక్షణ బీజేపీ పాలనతోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు. పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి ముందుండి పోరాడుతుందని వారు స్పష్టం చేశారు. పట్టణంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఇదే సందర్భంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ఉద్యమించాలన్నారు.
అనంతరం పార్టీ పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షునిగా నియమించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లిలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీల అధికారం, ఎమ్మెల్యేలు మారినప్పటికీ పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని ఆయన విమర్శించారు. పట్టణ అభివృద్ధికి బీజేపీ కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు. పట్టణంలో 2005 లో ఏర్పాటు చేసిన లెదర్ పార్క్ ప్రారంభానికి ఆందోళనలు చేపడతామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పట్టణ ప్రజలు బిజెపితో కలిసి రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నాయకులు మల్యాల రాజమల్లు, దార రవి సాగర్, కట్ల తిరుపతి, రంగు శ్రీనివాస్, పోతునూరు రాజేందర్, సత్యంబాబు, కర్రావుల వినయ్ లు పాల్గొన్నారు.