13-05-2025 06:21:53 PM
కేయూ సాంకేతిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుల్ల శ్రీనివాస్..
హనుమకొండ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను అడ్డుకోవాలని సాంకేతిక అఖిల భారత విశ్వవిద్యాలయ ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, కేయూ సాంకేతిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుల్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం కేయూ సాంకేతిక ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ పుల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉద్యోగ కార్మిక సంఘాల ఐక్యంగా నిర్వహిస్తున్న మే 20న దేశ వ్యాపిత సమ్మెకు కేయూ సాంకేతిక ఉద్యోగుల సంఘం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.
తమ సంఘం నేతృత్వంలో సమ్మెలో భాగంగా మే 20న కేయూ పరిపాలన భవనం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. కేంద్ర ఉద్యోగ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రంలో గతంలో ఉన్న 29 కార్మిక అనుకూల చట్టాలను రద్దు చేసిందన్నారు. 4 కొత్త కార్మిక నిర్బంద చట్టాలు తెచ్చిందన్నారు. గతంలో 10 మంది పనిచేసే సంస్థలకు బోనస్, పీఎఫ్, గ్రాట్యూటీ సదుపాయాలను వర్తించేవన్నారు. తాజా చట్టాలతో 100 పనిచేసే సంస్థలకు బోనన్, పీఎప్, గ్రాట్యూటీ అందే విధంగా నిబంధనలు రూపొందించారని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో ఏడుగురు కార్మికులతో సంఘాలను ఏర్పాటు చేసుకునే వీలుండగా తాజాగా 100 మంది ఉంటేనే సంఘాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కుల ఉల్లంఘనలతో పాటు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపడుతున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేయూ సాంకేతిక ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్.రాము, గౌరవ అధ్యక్షుడు వి. నందయ్య, కోశాధికారి వి. ప్రేమాసాగర్, జాయింట్ సెక్రటరీ వై. బాబు తదితరులు పాల్గొన్నారు.