13-05-2025 05:59:28 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కార్యకర్తగా కేసీఆర్, పార్టీ ఆదేశాలను పూర్తిగా పాటిస్తామని, కేసీఆర్ తర్వాత కేటీఆర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తామన్నారు. గతంలో కూడా ఈ అంశంపై చాలాసార్లు స్పష్టత ఇచ్చామని హరీశ్ రావు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు పిట్టల్లా చనిపోతున్నారని ఆయన వాపోయ్యారు. మరణించిన రైతుల మరణాలన్ని సహజ మరణాలు కావు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణాలే అని మండిపడ్డారు. రైతుల ప్రాణాలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల కోసం రివ్యూలు చేస్తున్నాడు.
వేలాది మంది పోలీసులను, ప్రభుత్వాధికారులను నియమించి అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. కానీ, దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం రివ్యూ చేయడానికి సమయం లేకపోవడం చాలా దురదృష్టకరం అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. దీంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏ పాటి ఉందో అర్థమవుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని రేవంత్ రెడ్డిని అడిగితే, తను ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే వాడిలా చూస్తున్నారని, తనన్ను ఎవ్వడూ నమ్మి అప్పు ఇవ్వలేదు అంటున్నాడని హరీశ్ రావు విరుచుకుపడరు. ప్రతిపక్షం మీద బురద జల్లబోయి, నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు అని, ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి అని విమర్శించారు.