13-01-2026 12:10:28 AM
సిద్దిపేట క్రైం, జనవరి 12 : మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి హెచ్చరించారు. సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్, రవాణాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు నుంచి విక్టరీ చౌరస్తా వరకు రోడ్డు భద్రతపై నినదిస్తూ ఫ్ల కార్డు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకన్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, రెండవసారి పట్టుబడితే జైలు శిక్ష విధిస్తున్నామని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ వెహికల్స్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. పట్టణంలో కూడా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపేవారికి చలానా విధించాలని పోలీస్ శాఖకు సూచించారు. ర్యాలీలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.