calender_icon.png 26 August, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీ విలీన గ్రామాలు

26-08-2025 07:11:35 PM

విలీన గ్రామాల అభివృద్ధి పై కొరవడిన మునిసిపల్ అధికారుల పర్యవేక్షణ...

సిపిఎం  రాష్ట్ర కమిటీ సభ్యులు పి జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు

వనపర్తి టౌన్: మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, విలీన గ్రామాల అభివృద్ధిపై మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పీ.జయలక్ష్మి, వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని సిపిఎం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆర్ఎం రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు పీ.జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా  మాట్లాడుతూ... వనపర్తి మున్సిపాలిటీలో  రాజనగరం నాగవరం శ్రీనివాసపురం మర్రికుంట నర్సింగ్ గాయపల్లి మరియు పెబ్బేరు కొత్తకోట ఆత్మకూర్ అమరచింత మున్సిపాలిటీల్లో విలీన గ్రామాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనిని మున్సిపల్ పట్టణాలకు వర్తింపజేయాలన్నారు.  మురికి కాలువలు, అంతర్గత రోడ్ల నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు. నూతనంగా వృద్ధాప్య, వితంతు,వికలాంగుల పెన్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఇవ్వడం లేదని తెలిపారు. పేదలు ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివాసం ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వ హాయంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి,దళిత బందుకు నోచుకోని దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయం చేయడం లేదన్నారు. మర్రికుంట గ్రామానికి చెందిన అనేకమంది పేదలు ఆకుకూరలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారని వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనిని ఎత్తివేయడంతో మహిళలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.విలీన గ్రామాలలో పన్నులు వసూలు చేయడంపై మున్సిపాలిటీ అధికారులకు ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని తెలిపారు.